WPL: రెండోసారి టైటిల్ కొట్టిన ముంబై ఇండియన్స్

WPL: రెండోసారి టైటిల్ కొట్టిన ముంబై ఇండియన్స్

 

  • 8 రన్స్ తో ఢిల్లీపై గెలుపు
  • రాణించిన హర్మన్‌‌, సివర్ బ్రంట్‌‌
  • మూడో ఫైనల్లోనూ డీసీకి నిరాశే


ముంబై: ఐపీఎల్‌‌లోనే కాదు విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌)లోనూ తమకు తిరుగులేదని ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఫ్రాంచైజీ మరోసారి నిరూపించింది. అద్వితీయ ఆటతో డబ్ల్యూపీఎల్‌‌లో రెండోసారి విజేతగా నిలిచి ఔరా అనిపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (28 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 66) మెరుపులకు తోడు సివర్ బ్రంట్ (28 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 30, 3/30) ఆల్‌‌రౌండ్ షోతో విజృంభించడంతో శనివారం జరిగిన మూడో సీజన్ ఫైనల్లో ముంబై అమ్మాయిలు 8 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ (డీసీ)ను ఓడించారు.

 వరుసగా మూడోసారి ఫైనల్‌‌ చేరిన  డీసీకి నిరాశ తప్పలేదు. తొలి సీజన్ విన్నర్ అయిన  ముంబై మొదట 20 ఓవర్లలో 149/7 స్కోరు చేసింది.  హర్మన్, బ్రంట్ రాణించగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో మరిజేన్ కాప్‌‌, జొస్‌‌ జొనాసెన్‌‌, శ్రీ చరణి తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌‌లో  డీసీ  ఓవర్లన్నీ ఆడి 141/9 స్కోరు చేసి ఓడింది. మరిజేన్ కాప్‌‌ (26 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), జెమీమా రోడ్రిగ్స్‌‌ (30), నిక్కీ ప్రసాద్ (25 నాటౌట్‌‌) పోరాడినా ఫలితం దక్కలేదు. బ్రంట్‌‌ మూడు, అమెలియా కెర్ రెండు వికెట్లు తీశారు. హర్మన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కెర్‌‌(18వికెట్లు) పర్పుల్ క్యాప్ అందుకోగా.. బ్రంట్ (523 రన్స్​​) ఆరెంజ్ క్యాప్‌, ప్లేయర్ ఆఫ్ ద సీజన్‌ అవార్డులు గెలిచింది.

కాప్‌‌ పోరాడినా.. 

టార్గెట్ ఛేజింగ్‌‌లో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి డీలా పడింది. ఇన్నింగ్స్ తొలి బాల్‌‌కే బౌండ్రీ కొట్టిన కెప్టెన్ మెగ్ లానింగ్ (13)ను రెండో ఓవర్లో క్లీన్‌‌బౌల్డ్ చేసిన సివర్ బ్రంట్‌‌ ఆ టీమ్‌‌ పతనాన్ని ఆరంభించింది. ఫామ్‌‌లో ఉన్న మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (4)ను షబ్నిమ్‌‌ ఎల్బీ చేసింది. ఆరో ఓవర్లో జెస్ జొనాసెన్ (13) రెండు ఫోర్లతో ఎదురుదాడికి దిగినా.. స్పిన్నర్‌‌‌‌ అమెలియా కెర్‌‌‌‌ తన తొలి బాల్‌‌కే ఆమెను పెవిలియన్ చేర్చింది. ఆ వెంటనే సదర్లాండ్ (2) స్టంపౌట్ అవ్వడంతో ఢిల్లీ 44/4తో డిఫెన్స్‌‌లో పడింది. కాసేపు  పోరాడిన  జెమీమా రోడ్రిగ్స్‌‌.. కెర్‌‌‌‌ బౌలింగ్‌‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి రిటర్న్‌‌ క్యాచ్ ఇవ్వడంతో ఢిల్లీ సగం వికెట్లు కోల్పోయింది. ఈ టైమ్‌‌లో కాప్ జట్టు బాధ్యత తీసుకుంది.  బ్రంట్ బౌలింగ్‌‌లో 6, 4తో ఎదురుదాడి చేసింది. సారా బ్రైస్ (5) రనౌటైనా .. హేలీ వేసిన 14వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జట్టును రేసులోకి తెచ్చింది. మరో ఎండ్‌‌లో నిక్కీ ప్రసాద్ స్ట్రయిక్‌‌ రొటేట్ చేయగా.. ఇషాక్‌‌ వేసిన 16వ  ఓవర్లో 4,6,4 కొట్టిన కాప్‌‌ ఢిల్లీ టీమ్‌‌లో విజయంపై ఆశలు పెంచింది. నిక్కీ కూడా ఓ ఫోర్ కొట్టడంతో ఢిల్లీ విజయసమీకరణం 18 బాల్స్‌‌లో 29 రన్స్‌‌గా మారింది. ఈ టైమ్‌‌లో బౌలింగ్‌‌కు వచ్చిన సివర్ బ్రంట్‌‌ 18వ ఓవర్లో కాప్‌‌, శిఖా పాండే (0)ను ఔట్‌‌ చేయడంతో ముంబై విజయం ఖాయమైంది. 
నిక్కీ చివరి బాల్‌‌ వరకూ క్రీజులో నిలిచినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. 

ఆదుకున్న హర్మన్‌‌

కెప్టెన్ హర్మన్‌‌ ముందుండి నడిపించడంతో ముంబై మంచి స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఆ టీమ్‌‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఢిల్లీ పేసర్ మరిజేన్ కాప్ వరుస ఓవర్లలో ఫామ్‌‌లో ఉన్న హేలీ మాథ్యూస్ (3), యాస్తికా భాటియా(8)ను ఔట్‌‌ చేసి షాకిచ్చింది. ఢిల్లీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్‌‌‌‌ ప్లేలో ముంబై 20/2 స్కోరు మాత్రం చేసింది. శ్రీచరణి బౌలింగ్‌‌లో సివర్ బ్రంట్ రెండు ఫోర్లు, సదర్లాండ్‌‌ ఓవర్లో హర్మన్ 6, 4 కొట్టి ఇన్నింగ్స్‌‌లో చలనం తెచ్చారు. సగం ఓవర్లకు ముంబై 53/2తో కోలుకోగా.. ఆ తర్వాత హర్మన్‌‌ ఒక్కసారిగా విజృంభించింది.  జొనాసెన్‌‌ బౌలింగ్‌‌లోహ్యాట్రిక్ ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించింది. మిన్ను మణి ఓవర్లోనూ రెండు బౌండ్రీలు రాబట్టి 33 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది.  మరో ఎండ్‌‌లో సివర్ కూడా షాట్లు ఆడటంతో 15  ఓవర్లకు స్కోరు 100 దాటింది. కానీ,  బ్రంట్‌‌ ఔటవడంతో ముంబై స్పీడుకు బ్రేకులు పడ్డాయి. తర్వాతి ఓవర్లో హర్మన్ సిక్స్ కొట్టినా.. అమెలియా కెర్ (2), సజన (0)ను ఔట్ చేసిన జొనాసెన్‌‌ దెబ్బకొట్టింది. సదర్లాండ్ బౌలింగ్‌‌లో హర్మన్‌‌ కూడా వెనుదిరగడంతో స్లాగ్ ఓవర్లలో ముంబై తడబడింది. చివర్లో కమలిని (10) ఓ సిక్స్ రాబట్టగా.. అమన్‌‌జోత్‌‌ (14 నాటౌట్‌‌) రెండు ఫోర్లు కొట్టడంతో ముంబై స్కోరు 140 దాటింది.

సంక్షిప్త స్కోర్లు 

ముంబై: 20 ఓవర్లలో 149/7 (హర్మన్‌‌ 66, బ్రంట్ 30, కాప్‌‌ 2/11, జొనాసెన్ 2/26).
ఢిల్లీ: 20 ఓవర్లలో 141/9 (కాప్ 40, జెమీమా 30, బ్రంట్ 3/30, కెర్ 2/25)