న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ ప్రెసిడెంట్, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సాక్షిగా ఉన్న రెజ్లర్ అనిత షెరాన్ డబ్ల్యూఎఫ్‌ఐ ఎలక్షన్స్ బరిలో నిలిచింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన షెరాన్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసింది. బ్రిజ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన స్టార్ రెజ్లర్లు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.
ఈనెల 12న జరిగే ఎలక్షన్స్‌లో ఆమె గెలిస్తే రెజ్లింగ్ ఫెడరేషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు కానుంది. డబ్ల్యూఎఫ్‌ఐలో 15 పోస్టుల కోసం వచ్చిన నామినేషన్ల లిస్ట్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ మంగళవారం వెల్లడించారు. ప్రెసిడెంట్ పోస్టుకు అనితతో పాటు బ్రిజ్ భూషణ్ వర్గం సపోర్ట్ ఉన్న జై ప్రకాశ్, దుశ్యంత్ శర్మ, మరో వర్గం నుంచి సంజయ్ కుమార్ పోటీలో ఉన్నారు. నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేందుకు ఈ నెల 7 వరకు గడువు ఉంది.