
- నిర్మల్ జిల్లా అడెల్లిలో వినూత్న నిరసన
- నచ్చజెప్పి విరమింపజేసిన పోలీసులు
నిర్మల్, వెలుగు : పశువులు వెళ్లే దారిని ఆక్రమించారంటూ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి గ్రామస్తులు పశువులతో రాస్తారోకో చేశారు. ఊరికి చెందిన పశువులు గ్రామంలోని ఓ దారి నుంచి అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లేవి. అయితే, ఆ దారిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించాడని, తమ పశువులు ఎలా మేతకు వెళ్తాయని మండిపడుతూ పశువులతో రాస్తారోకోకు దిగారు.
దాదాపు గంటకుపైగా ఆందోళన చేయడంతో అడెల్లి, స్వర్ణ గ్రామాల రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఆక్రమణకు గురైనట్లు చెబుతున్న భూమికి సంబంధించి కేసు హైకోర్టులో నడుస్తున్నట్టు తెలిసింది.