మా మనవరాలును చిన్నప్పుడు స్కూల్కు వాళ్ళ అమ్మమ్మ తోలేసి, తీసుకువస్తుండేది. మా అమ్మ మా మనవరాలును మీ అమ్మమ్మ ఏమైనా కొనిచ్చిందా అంటే దుకాణంలో ఏమీ కొనియ్యలేదు అని చెప్పుతూ ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికిపోయేది. అవునవును నువ్వు మీ అమ్మమ్మ ‘సత్తె పూసలు సల్ల గురుగులు’ అని మా అమ్మ అంటుండేది. సామెతలు ఏ భాషలోనైనా, ఏ వ్యక్తుల మధ్య అయినా ఆయా సమాజాల అనుభవ, అంతః సారాల మకుటాలు.
భాషా సౌందర్యం లోకోక్తులలో ఉట్టిపడు
తుంది. జనసామాన్యంలో సమయం సందర్భం వచ్చినప్పుడల్లా సంబంధించిన వ్యక్తుల ప్రవర్తన రీతులను శైలిలను ఉద్దేశించి పలువరిస్తుంటుంది. ప్రస్తుతం ఇటీవల ఎన్నికలలో అధికారం కోల్పోయిన రాజకీయ పక్షం తీరును గమనిస్తే ‘సత్తె పూసలు సల్ల గురుగులు’ అనే సామెత జ్ఞాపకం వచ్చి చూపరులకు, విన్నవారికి నవ్వు పుట్టిస్తున్నది. గత 10 సంవత్సరాల ప్రభుత్వ పాలన దాని నాయకుని, అనుచరుల వ్యవహారాలపై మాట్లాడొద్దు, రాయొద్దు , గత ప్రభుత్వ శుష్క వచనాలు, శూన్య హస్తాల నిర్వాకాల గురించి సిరా వృథా చేసుకోవద్దు అనుకున్నప్పటికీ, వాటి గురించి ఎంత మాట్లాడవద్దు అనుకున్నా పంటికింది రాయిలా కసుక్కున అడ్డం పడుతూనే ఉంటున్నాయి.
అంత ఘనకీర్తి ప్రజాస్వామ్య ముసుగులో రాజరికాన్ని అనుభవించిన మీరు మాత్రం తీవ్ర ఆక్షేపణీయంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని చెప్పక తప్పడం లేదు. ఏదో చేశామని పెగ్గెలు చెప్పుకునే పదేండ్లలో తెలంగాణ బర్బాద్ అయిపోయింది. మళ్లీ ఇప్పట్లో కోలుకోలేనంతగా వందల ఏండ్ల వెనుకకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఎవరి మీద ఏ ఆధిపత్య వర్గాల మీద మాట్లాడాలో అర్థంకాక గతంలో వెలగబెట్టిన నాయకులు నెత్తి నోరు ఒక్కటి చేసుకుని లబోదిబో అంటున్నారు. పెద్దగా వినేవారు లేరు. అంతగా పట్టించుకునే వారు లేరు. అప్పుడు వీరికి తెలంగాణ ఆస్తిత్వం అంటే తమ అస్తిత్వమే అన్నట్టుగా పనిచేసిన వారికి ఇప్పుడు అస్తిత్వం గుర్తు వస్తుంటే నవ్వే వారి ముందు జారిపడ్డట్టు హాస్యాస్పదంగా ఉంటుంది.
పొంకనాలు పోతూ మేకపోతు గాంభీర్యం
పైనుంచి మూడో గ్రేడ్ నాయకుడు ఆర్టీసీకి మహిళల ఉచిత ప్రయాణానికి చెందిన డబ్బులు చెల్లించడం లేదని మరో వంక మాట్లాడాడు .ఇది ప్రభుత్వం చూసుకుంటుంది కదా. ఏదో ఈయన పాలనలో ఆర్టీసీని మూడు పూలు ఆరు కాయలుగా నడిపినట్టు. ఎటూ మనసున పట్టక పొంకనాలు తెల్లారి లేస్తే ఏదో ఏవేవో పొంకనాలు పోతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదానని మళ్లీ ఈదుతానని వైనవైనాలుగా హరికథలు చెబుతుంటాడు. ఈయనగారి లీలలను ఉద్యమ కాలంలో ఆధిపత్య ప్రాంతాలవారిని అడిగితే చెప్తారు. గృహజ్యోతి విద్యుత్తును వాడుకునే 200 యూనిట్ల వినియోగదారులకు అమలు చేస్తుంటే ఏవో కొందరికి రాలేదని మరొక తిరకాసు పెడతారు.
లక్షలాదిమంది ఈ పథకం కింద లాభపడుతుంటే తగుదునమ్మా అంటూ ముఖం మంచిగా లేక అద్దాన్ని నేల కొట్టుకున్నట్టు మాట్లాడుతుంటారు. కొన్ని సాంకేతికంగా సమస్యలను పరిష్కరించి గృహజ్యోతి మిగతావారికి అమలు చేస్తామని ప్రభుత్వం వైపు నుంచి చెబుతుంటే వీరికి చెవి మీద పేను పారదు గాక పారదు. మరొక ముఖ్యమైన రైతు రుణమాఫీ పథకం రెండు లక్షల రూపాయల అప్పు ఇప్పటివరకు 22,37,848 లక్షల మంది రైతులకు,17,934 వేల కోట్ల రూపాయలళు రైతుల ఖాతాలో జమచేసి రుణ విముక్తి కలిగించామని ప్రభుత్వం ఒకవైపు చెప్తోంది. అంతేగాక మిగతా రైతుల ఇబ్బందులను పరిష్కరిస్తామని చెప్తుంటే, ప్రతిపక్షాలు పొద్దు పొద్దు అంతా కొలిచిన గదే మూడు జానెలు అన్నట్టుగా ఉంది. ఏదో ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని విపక్షాలు వాస్తవాలను తెర మీదికి తెస్తున్నట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మళ్లీ ఇప్పుడు నాకు మూడోసారి అదే సామెత ‘సత్తె పూసలు సల్లగురుగులు’ ఎందుకో ఏమో విపక్షాల తీరు చూస్తుంటే పదేపదే జ్ఞాపకం వస్తున్నది.
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు..
కొంతమంది మేధావులు, వాళ్ళ కాలంలో పదవులు అనుభవించినవారు, ఎన్నడూ కూడా వెనుకబడిన వర్గాల గురించి పల్లెత్తు మాట్లాడనివారు, ఇప్పుడు వెనుకబడిన వర్గాల గురించి లేక వెనుకకు నెట్టేసిన తరగతి గురించి నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు సన్నాయి నొక్కులు నొక్కుతు న్నారు. సరే, గత డిసెంబర్ 3 న ఏర్పడిన కొత్త ప్రభుత్వ నుంచి వారి మేనిఫెస్టో ప్రకారం ముఖ్యమైన హామీల గురించి విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పిండి కొద్దీ రొట్టె కదా ఎవరికైనా. దీనికి విపక్షాలు వారి మందు (వంది)మాగధులు తాము ఏదో తమ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మొత్తం నెరవేర్చినట్టు ఎక్స్ లో, తమ పత్రికలలో, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో సొల్లు కారుస్తు న్నారు. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానని ముఠా మేస్త్రీల్లా ప్రబుద్ధులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. కొంచెమైనా ఇంగిత జ్ఞానం ప్రదర్శించకుండా గత ప్రభుత్వం లో నేతలు వితండవాదం చేస్తున్నారు. ఎన్నికలలో గెలిచి ఏర్పడిన కొత్తప్రభుత్వం చేతిలో అప్పుల చిప్పను పెట్టి.. అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదంటున్నారు. తగుదునమ్మా అంటూ అనౌచిత్యపు అసందర్భపు గుట్టకు కుక్కలు మొరిగినట్టుగా ప్రేలాపనలు చేస్తూనే ఉన్నారు. మళ్లీ వీళ్ళ మాటలు వింటుంటే ‘సత్తె పూసలు సల్ల గురుగులు’ అనే నానుడి మరోసారి గుర్తుకొచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంటే, విపక్ష నాయకుడు అవాకులు చవాకులు పేలి ఆఖరికి నాలిక కరుచుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు.
- జూకంటి జగన్నాథం
కవి, రచయిత