విశ్లేషణ: తెలంగాణ జాతి ఆత్మరా బతుకమ్మా.. మా పిడికిట్ల వరి బువ్వరా బతుకమ్మా

కందికొండను కాపాడుకుందాం

“తెలంగాణ జాతి ఆత్మరా బతుకమ్మా.. మా పిడికిట్ల వరి బువ్వ మెతుకురా బతుకమ్మా’’ 
‘‘పసుపు కుంకుమ బొట్లందం.. ఎలుగుతాంటే దీపాంతం.. పల్లె పల్లె పావురంగ ఎత్తెను బోనం’’.. అంటూ తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన కలం అది.
‘‘మళ్లి కూయవే గువ్వా.. మోగిన అందెల మువ్వా/ 
తుళ్లి పాడవే పువ్వా.. గుండెలో సవ్వడి నువ్వా’’
‘‘గల గల పారుతున్న గోదారిలా.. జల జల జారుతుంటే కన్నీరెలా/’’... అంటూ 
సినీ పాటకు కొత్త సొగసులు అద్దిన అక్షరాలవి. 
ఆ కలానికి కష్టమొచ్చింది. ఆ అక్షరాలకు ఆపతొచ్చింది. 
పాటల కొండ.. మన కందికొండ క్యాన్సర్​తో బాధపడుతున్నరు. 

తెలంగాణ ఉద్యమంలో బరిగీసి పాటలతో కొట్లాడిన ఆయన.. ఇప్పుడు పుట్టెడు కష్టాలతో పోరాడుతున్నరు. సాయం కోసం ఎదురుచూస్తున్నరు. తెలంగాణ భాషకు, పండుగలకు, సాహిత్యానికి వన్నె తెచ్చిన కందికొండ యాదగిరిని సాదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు అందరిపైనా ఉంది.

తెలంగాణ పాటలతోపాటు ఎన్నో సినీ గేయాలు రాసిన కందికొండ యాదగిరికి అంతులేని కష్టమొచ్చొంది. ఆయనిప్పుడు గొంతు క్యాన్సర్‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అధికారులు కొంత సపోర్ట్‌‌‌‌ చేస్తున్నా అది ఆసుపత్రి ఖర్చులకే సరిపోవడం లేదు. సాయం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. సర్కారుతోపాటు తెలంగాణ సమాజం ఆయనకు అండగా ఉండాల్సిన సమయం వచ్చింది. 

ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాలో పేదింట్లో పుట్టిండు కందికొండ. కష్టపడి చదువుతూ ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్​డీ వరకు చదివాడు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను, పండుగల విశిష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలు రాసిన కందికొండ ప్రస్తుతం గొంతు క్యాన్సర్‌‌‌‌తో భాధపడుతూ గత కొన్ని రోజులుగా హాస్పిటల్‌‌‌‌లో చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం కీమో థెరపీ చేయించుకోవడం వల్ల స్పైనల్‌‌‌‌కార్డ్‌‌‌‌ లోని సీ1 సీ2 భాగాలు దెబ్బతిన్నాయట. దీంతో ఆయన నడవలేని పరిస్థితి. తొందరగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని కందికొండను పరీక్షించిన డాక్టర్లు చెబుతున్నారు. చికిత్స కోసం ఇప్పటి వరకు కందికొండ కుటుంబ సభ్యులు రూ. 26 లక్షలు ఖర్చు పెట్టారు. ఆయన ఆరోగ్యం మరింత క్షిణించడంతో వెన్ను భాగంలో సర్జరీ చేయడం కోసం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఉద్యమ పాటలూ రాశారు..
ఉస్మానియా యూనివర్సిటీలో  పీహెచ్​డీ చేసిన కందికొండ తెలంగాణ ఉద్యమ పాటలు కూడా రాశారు. తెలంగాణ రాష్ట్రం కోసం గొంతెత్తిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. తెలంగాణ ఫార్మేషన్​డేను పురస్కరించుకొని కూడా పాట రాశారు. ఇవిగాక ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్​కు పాటలు అందించారు. ప్రతి సంవత్సరం ‘బోనాలు’, ‘బతుకమ్మ’ పాటలు రాస్తూ తెలంగాణ బతుకులను ఆవిష్కరించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కోసం సినిమా పాటలపై పుస్తకాన్ని రాశారు. ‘భూలచ్చుమువ్వ’, ‘జెన్నకీడిశిన గిత్త గుండెల ప్రేమ జనించింది’ లాంటి కథలు అందించారు. ‘ఓయూ.. మా అవ్వ’ పేరిట కవితా సంపుటి కూడా తీసుకు రావాలనుకున్నారు. కానీ అనారోగ్యంతో కొంత బ్రేక్​పడింది. సినిమా రంగుల మాయలో కూరుకుపోయిన వారు, సామాజిక బాధ్యతలు పట్టించుకోవడం అరుదు. సోనూ సూద్ లాంటి ఒకరిద్దరు అందుకు మినహాయింపు. ఆయన ఎక్కువ మేరకు ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమాలను చేస్తున్నారు. అదే పనిని సాహిత్యంలో చేసిన వారు కందికొండ. పూలే, అంబేద్కర్ ఆలోచనా ధారను, దళిత బహుజన ఐక్యతను పెంపొందించే పాటలను, ముస్లింల దయనీయ స్థితిగతుల గురించి ఆయన పాటలు రాశారు. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చిత్రీకరించిన ‘పూలే వారసులం’ పాట ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఇవన్నీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉద్యమాలకు చేయూతనిచ్చే ఉద్దేశంతోనే రాశారు. ఉద్యమకారులకు, హక్కుల కార్యకర్తలకు, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. బహుజనోద్యమాలకు ఊపిరిలూది ఓ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. చిన్ననాటి మిత్రుడు చక్రితో కలిసి ఎన్నో సాహిత్య, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. అట్లాంటి కొండంత అండ ఇప్పుడు నిస్సహాయంగా అసుపత్రి బెడ్ పై దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం గొంతు విప్పి మాట్లాడ లేకుండా ఉన్న కందికొండకు మెరుగైన వైద్యం అందిస్తే మళ్లీ మనముందుకు తన కలంతో వస్తారు. మనలో స్ఫూర్తిని నింపే పాటలు ఎన్నో ఆయన కలం నుంచి జాలువారే అవకాశాన్ని మనం కల్పించాలి. మనం ఆయనను బతికించుకోవాలి. దీనికోసం దాతలతో పాటు సర్కారు స్పందించాలి.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలె
గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, కొరియోగ్రాఫర్ శివశంకర్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వరుసగా కాలం చేశారు. వీళ్లు చనిపోయినప్పుడు పత్రికల్లో పెద్ద ఎత్తున వ్యాసాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో నివాళులర్పించారు. వారికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయ, సహకారాలు కూడా అందించాయి.  సాహిత్యానికి, కళలకు, సమాజానికి తమ జీవితాన్ని అంకితం చేసినవారు మరణించినప్పుడు వారి కుటుంబాలను ఆదుకోవడం మానవత్వాన్ని చాటుతుంది. అలాగే చావు బతుకులతో పోరాడుతున్న కళాకారులను కాపాడుకోవడం ఈ సమాజానికి మరింత అవసరం. ఇదే సందర్భంలో మన మధ్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ సినీ గీత రచయిత, కవి, కథకుడు, విమర్శకుడు కందికొండ యాదగిరిని కాపాడుకోవాలి. ఇందు కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌‌‌ స్పందించి మెరుగైన వైద్యం చేయించేందుకు హామీ ఇచ్చారు. కొంత ఆర్థిక సాయమూ అందజేశారు. కానీ ఎంతో కొంత సహాయం చేసి వదిలేస్తే ప్రయోజనం లేదు. రోజూ దాదాపు70 వేల రూపాయలు అవసరమైన ఈ సమయంలో ఆ సాయం ఏ మాత్రం సరిపోవడం లేదు. క్యాన్సర్​తో పోరాడుతున్న ఆయనకు నాణ్యమైన ట్రీట్​మెంట్​అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కిరాయి ఇంట్లో ఉంటూ అద్దెకట్టడానికే ఇబ్బంది పడుతున్న కందికొండ కుటుంబానికి అండగా నిలిచేందుకు దాతలు ముందుకు రావాలి. సినీ రంగానికి కూడా ఆయన ఎన్నో సేవలందించారు. ‘‘రామా రామా రామా.. నీలీ మేఘా శ్యామా’’ లాంటి ఎన్నో మంచి పాటలు రాశారు. సినీ ఇండస్ట్రీ పెద్దలతోపాటు ఆయన పాటలు విని ఆనందించి, అభినందించిన శ్రోతలుగా ఆయనను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రఖ్యాత సినీ గీత రచయితలు, గాయకులు, సంగీతకారులు ఇటీవల ఒక లైవ్ ప్రోగ్రామ్ ద్వారా కందికొండ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అట్లాగే దాతల సాయాన్ని కోరారు. 

-సంగిశెట్టి శ్రీనివాస్, తెలంగాణ చరిత్రకారుడు