సబ్​ రిజిస్ట్రార్​ వర్సెస్​ డాక్యుమెంట్​ రైటర్స్​

సబ్​ రిజిస్ట్రార్​ వర్సెస్​ డాక్యుమెంట్​ రైటర్స్​
  • కిరికిరితో పడిపోయిన రిజిస్ర్టేషన్లు
  • గవర్నమెంట్​ ఇన్​కమ్​కు గండి 
  • డీఐజీ చెంతకు పంచాదీ

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ నగరంలోని సబ్​ రిజిస్ట్రార్, డాక్యుమెంట్​ రైటర్లకు మధ్య కోల్డ్​వార్​ గవర్నమెంట్​ ఇన్​కంను దెబ్బతీస్తోంది. రోజూ 50కి తగ్గకుండా జరిగే రిజిస్ట్రేషన్​లు ఈ వివాదం వల్ల ఐదుకు పడిపోయాయి. రిజిస్ర్టేషన్​ల కోసం వచ్చేవారు డాక్యుమెంట్​ రైటర్లను సంప్రదించవద్దని, నేరుగా తమ వద్దకు రావాలని జాయింట్​ రిజిస్ట్రార్​ సూచించగా.. అధిక లంచాలు డిమాండ్​ చేస్తూ వేధిస్తున్నారని రైటర్లు ఆరోపిస్తున్నారు. డాక్యుమెంట్​ రైటర్లు నాలుగురోజులుగా తమ ఆఫీసులను మూసేయడంతో రిజిస్ట్రేషన్ల మీద ప్రభావం చూపుతోంది. దీంతో ఈ పంచాదీ రిజిస్ర్టేషన్​ల శాఖ డీఐజీ వద్దకు చేరింది. 

 రైటర్ల ఆఫీసులు బంద్​

 చాలాకాలంగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న రిజిస్ట్రేషన్​ ఆఫీసర్లు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని మొత్తం తొమ్మిది సబ్​రిజిస్ట్రేషన్​ ఆఫీస్లులో పని చేస్తున్న సిబ్బందిని ప్రభుత్వం నాలుగు నెలల కిందట భారీగా బదిలీ చేసింది. అయినా అవినీతి ఆరోపణలు తగ్గలేదు. నిజామాబాద్​ లో పనిచేస్తున్న జాయింట్​ రిజిస్ర్టార్1​ తేజావత్​ కిరణ్​ మూడు నెలల నుంచి లీవ్​లో ఉన్నారు. విలువైన ఒక స్థిరాస్తి రిజిస్ర్టేషన్​కు సంబంధించి ఒత్తిళ్ల కారణంగా ఆయన లీవ్ పై వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది.

 ప్రస్తుతం జాయింట్​ రిజిస్ట్రార్​2 శ్రీరామరాజు ఒక్కరే ఉన్నారు. రిజిస్ట్రేషన్​ ఆఫీసుల్లో డాక్యుమెంట్​ రైటర్ల హవానే కొనసాగుతుంది. అధికారికంగా వారి పాత్ర ఏమీ లేకపోయినా డాక్యుమెంట్ల తయారీ దగ్గర నుంచి ఆఫీసు వ్యవహారాలన్నీ వారే చక్కబెడుతుంటారు. ఏ ఆఫీసర్​వచ్చినా రైటర్ల మీదే ఆధారపడుతుంటారు. రామరాజు వచ్చిన తర్వాత రైటర్లకు, ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఇరువురి మధ్య వాటాల వ్యవహారం బెడిసికొట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ప్రతి డాక్యుమెంట్​కు రూ 5 వేలు ఇవ్వాలని రామరాజు డిమాండ్​ చేస్తున్నారని రైటర్లు ఆరోపిస్తుండగా .. తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ల చేయాలని ఒత్తిడి తెస్తున్నారని రామరాజు అంటున్నారు. దీంతో వివాదం ముదిరి సోమవారం నుంచి రైటర్లు ఆఫీస్​లకు తాళాలు వేసి నిరసనకు దిగారు. దీంతో రోజుకు 50 వరకు రిజిస్ట్రేషన్లు జరిగి రూ. 2.5 కోట్ల వరకు వచ్చే ఆదాయం ఇప్పుడు రూ. 40 లక్షలకు పడిపోయింది. జాయింట్​ రిజిస్ట్రార్​ వేధిస్తున్నారంటూ రైటర్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీని కలిసి స్టాంప్స్​, రిజిస్ట్రేషన్​ల శాఖ డీఐజీ రమేష్​రెడ్డికి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి 2004లోనే డాక్యుమెంట్​ రైటర్ల వ్యవస్థను గవర్నమెంట్​ రద్దు చేసింది. అయినా వాళ్లు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగే పరిస్థితి లేదు. ఆఫీసుల్లో సిబ్బంది కొరత, క్లయింట్ల నుంచి మామూళ్లు వసూలు చేసి ఇస్తుండడంతో ఆఫీసర్లు కూడా పూర్తిగా రైటర్ల మీదే ఆధారపడుతున్నారు. 

రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి

 రైటర్ల నిరసనలతో మాకేం సంబంధం లేదు. రిజిస్ట్రేషన్లు బంద్​అయ్యాయని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం. కొనుగోలుదారులు నేరుగా ఆఫీసుకు వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

జిల్లా రిజిస్ర్టార్​ ప్రసూన