తెలంగాణ రచయితల సంఘాలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన తొలి, మలిదశ ఉద్యమాల్లో రచయితలు కీలక పాత్ర పోషించారు. సాహిత్య, సాంస్కృతిక వేదికలను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేశారు.  తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై రచించిన పుస్తకాలు మేధావులు, సామాన్య పాఠకులను సైతం ఆలోచింపజేశాయి.

తెలంగాణ సాంస్కృతిక వేదిక

తెలంగాణ సాంస్కృతిక వేదికను 1998, నవంబర్​ 1న ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అనేక సమావేశాలను ఏర్పాటు చేసి తెలంగాణపై పుస్తకాలను ప్రచురించి తెలంగాణ కళారూప ప్రదర్శనలను నిర్వహించింది. తెలంగాణ కవుల కవితలతో మత్తడి అనే పేరుతో సుంకిరెడ్డి నారాయణరెడ్డి, అంబటి సురేందర్ రాజు సంపాదకత్వంలో బృహత్​ కవితా సంకలనం వెలువడింది. తెలంగాణ తోవలు, దాలి, భౌగోళిక సందర్భం తదితర గ్రంథాలను ప్రచురించి రచయితలు, మేధావులు, సామాన్య పాఠకుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారు. తెలంగాణ అస్తిత్వం, సాహిత్య, సాంస్కృతిక వ్యాసాల పుస్తకం తెలంగాణ తోవలు, తెలంగాణ రాజకీయ, సాహిత్య వ్యాసాలతో భౌగోళిక సందర్భం అనే పేరుతో కాసుల ప్రతాపరెడ్డి పుస్తకాలను రచించారు. 

తెలంగాణ రచయితల వేదిక 

తెలంగాణ రచయితల వేదిక 2001, అక్టోబర్​ 14న సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. ఈ వేదికలోని సభ్యులు నందిని సిధారెడ్డి, అన్నవరం దేవేందర్​, జైని మల్లయ్యగుప్తా కీలక పాత్ర పోషించారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో జిల్లా శాఖలను ఏర్పాటు చేసి నిత్యం సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమ సంస్థగా పేరుగాంచింది. ఈ సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా ప్రజాకవి కాళోజి నారాయణరావు, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా నందిని సిధారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వేణు సంకోజు పనిచేశారు. తదనంతరం జూకంటి జగన్నాథం రాష్ట్ర అధ్యక్షుడిగా, జూలూరు గౌరీశంకర్​ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో రచయితల వేదిక అధ్యక్షుడిగా జూలూరు గౌరీశంకర్, కార్యదర్శిగా సురేపల్లి సుజాత వ్యవహరించారు.  

తెలంగాణ సాహిత్య యుద్ధభేరి

2013, జనవరి 20న దోమలగూడలోని ఏవీ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య యుద్ధ భేరీ అనే సభను నిర్వహించారు. ఈ సభకు రచయితల వేదిక మాజీ అధ్యక్షులు జూకంటి జగన్నాథం అధ్యక్షత వహించారు. ఈ సభలో జ్ఞానపీఠ్​ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి జై తెలంగాణ అంటే సై తెలంగాణ అని నినదించారు. 

తెలంగాణ సింగిడి రచయితల సంఘం

తెలంగాణ సాహిత్య వికాసాన్ని కాపాడటం కోసం వివిధ జిల్లాలోని కవులు, రచయితల సమ్మేళనంతో 2008, సెప్టెంబర్​ 21న తెలంగాణ సింగిడి రచయితల సంఘం ఆవిర్భవించింది. సీమాంధ్రుల చేతిలో అణచివేతకు గురైన తెలంగాణ సాహిత్యాన్ని పునరుజ్జీవంపజేయడం, తెలంగాణలోని కవులందరు వారి ప్రాంతాల్లోని మాండలికంలోనే తెలంగాణ సాహిత్యాన్ని రాయాలి, తెలంగాణ సాహిత్య అస్థిత్వాన్ని కాపాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని లక్ష్యాలుగా పనిచేసింది. తెలంగాణ కథా వేదిక అనే సంస్థ తెలంగాణ కథ – దేవులాట అనే వ్యాసాల సంకలనం, చౌరస్తా అనే కథా సంకలనాన్ని వెలువరించింది. ముదిగంటి సుజాతారెడ్డి తెలంగాణ తొలి తరం కథలు అనే పేరుతో తెలంగాణ కథలను అందించారు. 

ALSO READ :తెలంగాణ జాబ్స్ స్పెషల్.. నిరుద్యోగిత అంచనాలు

తెలంగాణ భాషా సంస్కృతి మండలి

తెలంగాణ భాషా సంస్కృతి మండలిని 2006లో గంటా జలంధర్​రెడ్డి అధ్యక్షతన స్థాపించారు. ఇది ప్రధానంగా తెలంగాణ సాహిత్యం  మీద తన దృష్టిని కేంద్రీకరించి అనేక జాతీయ సదస్సులను నిర్వహించింది. 2009, మార్చి 6, 7వ తేదీల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి – సురవరం ప్రతాపరెడ్డి అనే అంశం మీద జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పరిశోధకులు, రచయితలు సమర్పించిన పత్రాలను గ్రంథ రూపంలో ప్రచురించి 2011, నవంబర్​ 23న జస్టిస్​ బి.సుదర్శన్​రెడ్డి ఆవిష్కరించారు. 2012, మార్చి 16, 17వ తేదీల్లో ప్రజాకవి కాళోజీ సాహిత్య సమాలోచన అనే అంశం మీద జాతీయ సదస్సును నిర్వహించారు. 2012, ఆగస్టు 31న సంగిశెట్టి శ్రీనివాస్​ సంపాదకత్వంలో వచ్చిన సురవరం కవిత్వం అనే గ్రంథాన్ని ఎల్లూరి శివారెడ్డి ఆవిష్కరించారు.   2013, మే 2, 3వ తేదీల్లో తెలంగాణ ద్వీపస్తంభం– పరిపాలనదక్షుడు ప్రజాసేవతత్పరుడు  రాజా బహదూర్​ కొత్వాల్​ వెంకటరామారెడ్డి అనే అంశం మీద జాతీయ సదస్సును నిర్వహించారు.  

తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య

తెలంగాణ చారిత్రక సాంస్కృతిక నేపథ్యంలో ఒక వేదికను ఏర్పాటు చేయాలని భావించి 2007, జూన్​లో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యను స్థాపించారు. ఈ సంస్థకు గూడ అంజయ్య అధ్యక్షులుగా, గద్దర్​ గౌరవ అధ్యక్షుడిగా, బి.ఎస్.రాములు, పాశం యాదగిరిలు సలహాదారులుగా రాష్ట్ర కమిటీ ఏర్పడింది. తెలంగాణలోని ప్రజా సంఘాల కళాకారులను ఏకం చేయడం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రమించడం, తెలంగాణ సంస్కృతి, ఉత్సవాలు, ఆటపాటల ద్వారా ఉద్యమాన్ని కొనసాగించడం, తెలంగాణ ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడం లక్ష్యాలుగా పనిచేసింది.