హైదరాబాద్: సాధారణంగా ఉద్యోగం కోసం నియామక పరీక్షలు నిర్వహిస్తుంటారు.. కానీ ఇక్కడ కొలువు కోసం కాదు.. నామినేటెడ్ పదవి కోసం పరీక్ష పెట్టారు కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు. రాత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన మహిళలకు మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పదవికి సిఫార్సు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రాత పరీక్ష రాసి అత్యధిక మార్కులు పొందారు అయిల్వార్ సౌజన్య. సాధారణంగా రాష్ట్రంలో ఏ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎన్నిక అయినా.. స్థానిక ఎమ్మెల్యేనో, మంత్రో సిఫారసు చేస్తారని.. కానీ, పరీక్షలు నిర్వహించి ప్రతిభ కలిగినవాళ్లు, చదువుకున్నవాళ్లకు అవకాశం కల్పించారు.
మూడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముగ్గురు సీనియర్ లీడర్లతో కలిపి మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎన్నికకు కమిటీ వేశారు. ప్రశ్నాపత్రం రూపొందించి.. అందులో టాపర్‌కు పదవి కట్టబెట్టడం విశేషం. ఇవాళ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో అయిల్వార్ సౌజన్య మంత్రి కోమటిరెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా రాత పరీక్షలో ఎంపికైన సౌజన్యను, ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న లక్ష్మీకాంతారావును మంత్రి అభినందించారు.
రాజకీయాల్లో ఎక్కడో ఒకచోట మార్పు మొదలు కావాలని.. అది సౌజన్య నుంచే మొదలైందని.. అందరూ ఈ విధానాన్ని పాటిస్తే ప్రజలకు జవాబుదారిగా ఉండొచ్చని అన్నారు. ప్రతిభ కలిగినవాళ్లు, చదువుకున్నవాళ్లు ఛైర్మన్ కావాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మంచి ప్రయత్నం చేశారన్నారు. ఇది సమకాలిన రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఎమ్మెల్యే ఇదే విధంగా ప్రయత్నిస్తే.. రైతులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు.
గ్రామంలో, పంచాయితీ నిధులు దుర్వినియోగం కాకుండా గ్రామంలో నలుగురు వాలంటీర్లతో ఒక పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి నిధులు పక్కదారి పట్టకుండా మంచి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారితనం లేకపోవడంతో దేశం వెనకబాటుకు గురవుతుందని, విద్య పెరిగిన ఈ రోజుల్లో ఇటువంటి ప్రయత్నాలు కారు చీకటిలో వెలుగుదివ్వెలుగా సమాజానికి మంచి సందేశం ఇస్తాయని మంత్రి ప్రశంసించారు. డబ్బు ప్రమేయం పెరిగిపోయిందని రాజకీయాలకు దూరంగా ఉంటున్న యువతకు రాజకీయాల పట్ల ఒక నమ్మకాన్ని కలిగిస్తాయని చెప్పారు.