
- ‘రేప్ అటెంప్ట్’ తీర్పుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత
- అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందని ఆందోళన
- సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని డిమాండ్
- అది తప్పుడు తీర్పు: కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి
న్యూఢిల్లీ: మహిళ ఛాతిపై చేయి వేయడం, డ్రెస్ లాగడం అత్యాచారయత్నం కిందికి రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇలాంటి తీర్పులు సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపుతాయంటూ ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నది.
ఇది మహిళల హక్కులు, లైంగిక హింసకు సంబంధించిన చట్టాలపై మరోసారి చర్చకు దారితీసింది. దేశంలో ఇప్పటికీ మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తీర్పును కేంద్రమంత్రులు, నాయకులు, మహిళా కమిషన్లు, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు ఖండించారు.
ఖండించిన మహిళా నేతలు..
అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఖండించారు. అది తప్పుడు తీర్పు అని ఆమె శుక్రవారం పేర్కొన్నారు. ఇలాంటి తీర్పులు సమాజానికి తప్పుడు సందేశం ఇస్తాయని చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్‌పై మరికొంత మంది మహిళా లీడర్లు కూడా స్పందించారు. ఈ తీర్పు తనను షాక్‌కు గురిచేసిందని ఆప్ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మాలివాల్ అన్నారు.
‘‘ఇది చాలా దురదృష్టకరం.. సిగ్గుచేటు. ఒక మహిళ విషయంలో పురుషులు అలా ప్రవర్తిస్తే రేప్‌కు ప్రయత్నించినట్టు కాదా? ఈ జడ్జిమెంట్ వెనుక ఉన్న లాజిక్ ఏంటో అర్థం కావడం లేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవాలి” అని ఆమె కోరారు. మన దేశంలో మహిళలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జూన్ మాలియా పేర్కొన్నారు.