డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 296 పరుగుల లీడ్ లో ఉన్న, ఆసీస్ నాలుగో రోజు ఆటలో మరో రెండు సెషన్లు కొనసాగించవచ్చు. అదే జరిగితే వారు భారత్ ముందు 400 - 430 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగలరు. చివరి రెండు రోజుల ఆటలో అంత లక్ష్యాన్ని ఛేదించడం అంటే భారత బ్యాటర్లకు సవాలే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ.. విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో అగ్గి రాజేస్తున్నాయి. కోహ్లీ జట్టులో ఉన్నప్పుడు.. అది ఎంత పెద్ద లక్ష్యమైనా ఆందోళన చెందాల్సిన పనిలేదని దాదా చేసిన వ్యాఖ్యలను విరాట్ అభిమానులు వివాదాస్పదం చేస్తున్నారు.
మూడో రోజు ఆట ముగిశాక గంగూలీ స్టార్ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో మాట్లాడాడు. 'ప్రస్తుతానికి ఆసీస్ 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకవేళ టార్గెట్ 370 నుంచి 400 మధ్య నిలిపినా టీమిండియా పెద్దగా ఆందోళన చెందాల్సిన పన్లేదు. ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా చేధించగల మొనగాడు(కోహ్లీ) జట్టులో ఉన్నాడు. మిగిలిన భారత బ్యాటర్లు కాస్త మెరుగ్గా ఆడితే అదేం పెద్ద అసాధ్యమేమీ కాదు. చివరి రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు..' అని గంగూలీ తెలిపాడు.
ఈ వ్యాఖ్యలను కోహ్లీ అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. 'అవి పొగడ్తలు కాదు.. సెటైర్లు..' అంటూ కొందరు, 'కోహ్లీ ఆడలేడని అర్థం వచ్చేలా.. గంగూలీ ఇలా జోకులు వేస్తున్నాడని..' మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్ పిచ్‌లపై చివరి రెండు రోజుల్లో బ్యాటర్లు భారీ స్కోర్లు చేయడమంటే జరగని పనే. అదీ తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే ఔటైన కోహ్లీ నుంచి భారీ స్కోర్ ఆశించడం అత్యాశే అవుతుంది. ఈ సమయంలో దాదా వ్యాఖ్యలు అభిమానుల్లో వేడి పెంచుతున్నాయి.