WTC 2023-25: ఒక్క విజయం.. తలకిందులైన టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసు

WTC 2023-25: ఒక్క విజయం.. తలకిందులైన టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసు

విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజ‌యం సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌ను 106 ప‌రుగుల‌ తేడాతో మట్టికరిపించి ఉప్పల్ ఓటమికి బదులు తీర్చకుంది. భారత జట్టు నిర్ధేశించిన 399 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌ 292 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ గెలుపుతో టీమిండియా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికను తలకిందులు చేసింది. టెస్ట్ క్రికెట్‌లో తమ ఆట వేరని విర్రవీగే ఇంగ్లాండ్‌ను ఎనిమిదో స్థానానికి నెట్టింది.

 రెండో టెస్టులో విజయంతో భారత జట్టు ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో  52.77 విజయ శాతంతో నిలిచింది. ఇదిలా ఉంటే, గబ్బా టెస్ట్‌లో వెస్టిడీస్‌ చేతిలో ఘోర పరాజయం పాలైనప్పటికీ ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 55 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఈ స్టాండింగ్స్‌లో ఇంగ్లండ్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. ఈ రేసులో శ్రీలంక అట్టడుగున ఉంది.

ప్రస్తుతం 2023-25 సైకిల్‌లో భారత జట్టు.. ఆరు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి, రెండింట ఓటమిపాలైంది. ఒకదాన్ని డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి మూడు టెస్టుల్లో టీమిండియా విజయం సాధిస్తే ప్రస్తుత సైకిల్‌లో అగ్రస్థానంపై ఆశలు పెట్టుకోవచ్చు. మొదటి రెండు స్థానాల్లో నిలిచేందుకు బలమైన పోటీదారుగా ఉండవచ్చు.

ఐసీసీవరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ స్టాండింగ్స్ 2023-25

  • ఆస్ట్రేలియా: 55 విజయ శాతం
  • భారతదేశం: 52.77 విజయ శాతం
  • దక్షిణాఫ్రికా 50 విజయ శాతం
  • న్యూజిలాండ్ 50 విజయ శాతం
  • బంగ్లాదేశ్: 50 విజయ శాతం
  • పాకిస్తాన్: 36.66 విజయ శాతం
  • వెస్టిండీస్: 33.33 విజయ శాతం
  • ఇంగ్లండ్: 25 విజయ శాతం
  • శ్రీలంక: 0 విజయ శాతం