రేపటి నుంచే ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఫైనల్..  ఆ ఇద్దరి వైపే అందరి చూపు.. 

రేపటి నుంచే ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఫైనల్..  ఆ ఇద్దరి వైపే అందరి చూపు.. 

వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధ‌వారం ఓవ‌ల్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఆస్ట్రేలియా- ఇండియా ఫైనల్ మ్యాచ్‌కు ఇరు జ‌ట్లు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే ఎలా రాణిస్తారన్నది అతి పెద్ద సస్పెన్స్‌గా మారింది.

స్వదేశంలో జరిగిన ఐపీఎల్ 2023లో అద్భుతంగా రాణించిన గిల్.. 17 మ్యాచుల్లో 890 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ స్వదేశీ పిచ్‌లకు.. ఇంగ్లండ్ పిచ్‌లకు చాలా తేడా ఉంటుంది. ఇండియా పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తే.. ఇంగ్లండ్ పిచ్‌లన్నీ దాదాపు పేస్‌కు అనుకూలిస్తాయి. ఇలాంటి సమయంలో పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, బోలాండ్.. త్రయాన్ని గిల్ ఎలా ఎదుర్కొంటాడన్నది అందరి ముందున్న ప్రశ్న. ఇప్పటివరకూ 15 టెస్ట్ మ్యాచులు ఆడిన గిల్.. 890 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

 ఇక అనుభవం దృష్ట్యా రహానే ఎక్కువ మ్యాచులు ఆడినప్పటికీ.. ఏడాదన్నర తరువాత టెస్ట్ పునరాగమనం చేయడం అతని ఫామ్‌ని ప్రశ్నిస్తోంది. రహానే చివరిసారిగా గతేడాది జనవరిలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో కనిపించాడు. ఆ తరువాత జట్టుకు దూరమైన రహానే.. ఐపీఎల్ 2023లో రాణించడంతో టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌‌కు ఎంపికయ్యాడు. ఇప్పటివరకూ 15 టెస్ట్ మ్యాచులు ఆడిన రహానే.. 4931 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. క్లాసిక్ షాట్లతో రాణించగల ఈ వెటరన్ బ్యాటర్.. నిలకడగా రాణించాడంటేభారత మిడిల్ ఆర్డర్‌కు ఎలాంటి సమస్య లేనట్లే. లేదంటే కోహ్లీ, పుజారాపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

జట్ల వివరాలు

ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్,  రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, అజింక్య రహానె, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్‌, ఉమేశ్ యాదవ్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వి జైస్వాల్, ముఖేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్‌ కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కెరీ (వికెట్ కీపర్‌), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్‌), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నేసర్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్ మార్ష్, మాట్‌ రెన్‌షా.