టెస్టు ఫార్మాట్‌కే వన్నె తెచ్చిన ప్రపంచ టెస్టు చాంపినయన్‌షిప్ ఫైనల్ పోరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జూన్ 7 నుంచి 11 వరకూ భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తొలిసారి కప్ చేజిక్కించుకునే అవకాశాన్ని మిస్ చేసుకున్న ఇండియా ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా 'టెస్ట్ రారాజు'గా నిలవాలని ఉవ్విళ్ళూరుతోంది. మేటి జట్ల మధ్య సమరం కావడంతో హోరీహోరీ పోరు ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఈ వేదికపై ఇరు జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయి? ఛాంపియన్ గా నిలిచే అవకాశాలు ఆ జట్టుకు ఎక్కువ? అన్నది చూద్దాం..
1936లో తొలి మ్యాచ్..
భారత జట్టు 1936 నుండి ఓవల్‌లో ఆడుతోంది. అయితే ఈ వేదికపై మొదటి విజయాన్ని సాధించేందుకు భారత్‌కు 35 ఏళ్లు పట్టింది. 1971లో అజిత్ వాడేకర్ సారథ్యంలో ఇంగ్లండ్‌పై తొలి విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకూ ఈ వేదికపై 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత్.. కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. ఐదు మ్యాచుల్లో ఓటమి పాలవ్వగా.. ఏడు డ్రాగా ముగిశాయి.
ఓవల్ వేదికపై భారత జట్టు ఆడిన తొలి మ్యాచుకు విజయనగరం మహారాజు నాయకత్వం వహించిచాడు. ఈ మ్యాచులో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక చివరిసారిగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌తో తలపడ్డ భారత్.. 157 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ 127 పరుగులతో రాణించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
ఆస్ట్రేలియాది 140 ఏళ్ల చరిత్ర..
ఆస్ట్రేలియా జట్టు 1880 నుండి ఈ వేదికపై ఆడుతోంది. అయితే ఈ 140 సంవత్సరాలలో కేవలం 7 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. ఇప్పటివరకూ ఈ వేదికపై 38 మ్యాచులు ఆడిన ఆసీస్..ఏడింట గెలవగా, 17 మ్యాచుల్లో ఓటమి పాలైంది. మరో 14 మ్యాచులు డ్రాగ ముగిశాయి.
ఆస్ట్రేలియాదే పైచేయి..
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు మొత్తం 106 టెస్టు మ్యాచులు జరగ్గా.. ఆస్ట్రేలియా 44, భారత జట్టు 32 మ్యాచుల్లో విజయం సాధించాయి. 29 మ్యాచులు డ్రాగా ముగియగా, ఒక మ్యాచ్ టై అయింది.
ఓవల్‌లో చివరి ఐదు మ్యాచులు..
ఓవల్ వేదికపై భారత్ ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో మెన్ ఇన్ బ్లూ కేవలం ఒక దానిలో మాత్రమే విజయం సాధించింది. మూడింటిలో ఓడిపోగా, మరొకటి డ్రాగా ముగిసింది. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే.. గత ఐదు మ్యాచ్‌ల్లో ఆసీస్ కూడా ఒక మ్యాచులోనే విజయం సాధించింది.