న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం టీమిండియా ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది. అందులో భాగంగా ఏడుగురు ప్లేయర్లతో కూడిన తొలి బ్యాచ్ మంగళవారం తెల్లవారుజామున లండన్ బయలుదేరి వెళ్లనుంది. విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, జైదేవ్ ఉనాద్కట్‌తో పాటు నెట్ బౌలర్లు అంకిత్ చౌదరి, అక్ష్‌దీప్, యర్రా పృథ్వీ రాజ్ ఇందులో ఉన్నారు. వీళ్లతో పాటు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సపోర్ట్ స్టాఫ్ కూడా యూకే వెళ్తున్నారు.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ముగిసిన తర్వాత మిగతా ప్లేయర్లు లండన్ బయలుదేరనున్నారు. ఇందులో రోహిత్ శర్మ, జడేజా, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, షమీ, కేఎస్ భరత్, అజింక్యా రహానె ఉన్నారు. ఇప్పటికే చతేశ్వర్ పుజారా కౌంటీ క్రికెట్ కోసం లండన్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌లో కౌంటీ చాంపియన్‌షిప్ జరుగుతున్నందున టీమిండియా ఎలాంటి వామప్ మ్యాచ్ లేకుండానే డబ్ల్యూటీసీ ఫైనల్లో బరిలోకి దిగనుంది. జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.