మరికొద్ది గంటలల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమరం మొదలవబోతుంది. లండన్‌లోని ఓవల్ గ్రౌండ్లో భారత్, ఆస్ట్రేలియా ఢీకొట్టుకోనున్నాయి. తొలిసారిగా ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడుతుండగా..భారత జట్టు వరుసగా రెండోసారి టైటిల్ ఫైట్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో టైటిల్ గెలుచుకోవాలని రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
పిచ్ ఎలా ఉందంటే..
WTC ఫైనల్ కోసం ఐసీసీ గ్రీన్ వికెట్ సిద్దం చేసింది. ఓవల్ పిచ్ పూర్తిగా పచ్చికతో ఉంది. ఈ నేపథ్యంలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పిచ్ పై అనూహ్య బౌన్స్‌తో పాటు స్వింగ్ లభిస్తుంది. మ్యాచ్ చివరి రెండు రోజులు వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత జట్టు పిచ్ కు తగ్గట్లు మార్పులు చేసుకోని బరిలోకి దిగే అవకాశం ఉంది.
తుది జట్టులో ఉండే బౌలర్లు వీరే..
ఓవల్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉండటంతో టీమిండియా ఒకే ఒక స్పిన్నర్తో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంతో తుది జట్టులో అశ్విన్కు ఛాన్స్ దక్కొచ్చు. ఇతనితో పాటు..ఉమేష్ యాదవ్, షమీ, సిరాజ్ తుది జట్టులో ఉంటారు. ఆల్ రౌండర్లుగా జడేజా, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులో స్థానం దక్కించుకుంటారు.
బ్యాటింగ్ విభాగంలో ఎవరు ఆడతారు..
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగడం ఖాయం. మిడిలార్డర్ లో పుజారా, కోహ్లీ, రహానే, ఇషాన్ కిషన్ ఆడతారు. అయితే వికెట్ కీపింగ్ విషయంలో కేఎస్ భరత్ ను తీసుకుంటారా లేదా ఇషాన్ కిషన్ ను ఆడిస్తారా అన్నది సస్పెన్స్. అయితే పిచ్ లో స్వింగ్, బౌన్స్ ఉండనున్న నేపథ్యంలో కీపర్లకు పెద్దగా పని ఉండే అవకాశం లేదు. ఈ క్రమంలో తుది జట్టులో ఇషాన్ కిషన్ కు ఛాన్స్ దక్కొచ్చు. అంతేకాకుండా ఇషాన్ కిషన్‌ను తీసుకుంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో పాటు ధాటిగా ఆడే బ్యాటర్ జట్టుకు లభిస్తాడు.
WTC ఫైనల్ ఆడే భారత తుది జట్టు(అంచనా మాత్రమే)
రోహిత్ శర్మ, గిల్, పుజారా, కోహ్లీ, రహానే, ఇషాన్ కిషన్, జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, షమీ, సిరాజ్.