ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నల్ 2023 మరో కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.WTC 2023 టైటిల్ కోసం భారత్ , ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లండన్‌లోని ఓవల్ మైదానంలో జూన్ 6న మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ టీమిండియాకు కీలకంగా మారే అవకాశం ఉంది. సూపర్ ఫాంలో ఉన్న కోహ్లీ చెలరేగితే ఆస్ట్రేలియాకు కష్టమే. దీనికి తోడు ఆసీస్ పై కోహ్లీకి మంచి రికార్డులున్నాయి. ఈ నేపథ్యంలో WTC ఫైనల్ లో కోహ్లీ మరిన్ని రికార్డులు అందుకోబోతున్నాడు.
సెహ్వాగ్ రికార్డును బద్దలు కొడతాడా..?
టీమిండియా మాజీ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ తన టెస్ట్ కెరీర్లో 8586 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్ మన్ జాబితాలో సెహ్వాగ్ 5వ స్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ తర్వాత కోహ్లీ 108 టెస్ట్ మ్యాచుల్లో 8416 పరుగులతో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచులో కోహ్లీ 171 పరుగులు చేస్తే సెహ్వాగ్ రికార్డును బద్దలు కొడతాడు.
ద్రావిడ్ రికార్డును దాటేస్తాడా..?
టీమిండియా మాజీ కెప్టెన్ ద్రావిడ్ కు ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లలో ఒకడు. ద్రావిడ్ ఆస్ట్రేలియాపై 60 ఇన్నింగ్స్ లలో 13 అర్థ సెంచరీలు, రెండు సెంచరీలతో 2143 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై కోహ్లీ 42 ఇన్నింగ్స్ లలో 1979 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను ఆసీస్ పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. ద్రావిడ్ రికార్డ్ దాటాలంటే కోహ్లీ మరో 164 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ తో రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.
పాంటింగ్ రికార్డ్ పై కన్ను
భారత్- ఆస్ట్రేలియా సిరీస్ లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 11 సెంచరీలతో సచిన్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 8 సెంచరీలతో పాంటింగ్ , కోహ్లీ, స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నారు. అయితే WTC ఫైనల్లో కోహ్లీ, స్టీవ్ స్మిత్ లలో ఎవరు సెంచరీ చేసిన పాంటింగ్ రికార్డ్ బద్దలు అవుతుంది.
రికార్డులనూ కోహ్లీ అధిగమిస్తాడా..?
- ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ ఇప్పటి వరకు ఎక్కువ సంఖ్యలో ఐసీసీ నాకౌట్ స్టేజ్ మ్యాచ్ లు ఆడాడు. ఐసీసీ నాకౌట్ స్టేజ్ లో వన్డే వరల్డ్ కప్ , టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలతో కలిపి పాంటింగ్ 18 మ్యాచ్ లు ఆడాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ 17 మ్యాచ్ లు ఆడాడు. సచిన్, ధోనీ, కోహ్లీలు 15 మ్యాచ్ లు ఆడారు. WTC ఫైనల్ మ్యాచ్ తో కోహ్లీ ధోనీ, సచిన్ ల రికార్డును అధిగమిస్తాడు.
- ఆస్ట్రేలియాపై కోహ్లీ 92 మ్యాచుల్లో 50.97 యావరేజ్ తో 4,945 పరుగులు సాధించాడు. మరో 45 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాపై కోహ్లీ 5 వేల పరుగుల మార్క్ ను అధిగమిస్తాడు. WTC ఫైనల్లో కోహ్లీ ఈ ఫిట్ ను అందుకుంటాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 2 వేల పరుగులు సాధించే రికార్డు కోహ్లీని ఊరిస్తోంది. అతను ఇప్పటి వరకు ఆసీస్ పై 24 టెస్టుల్లో 48.26 సగటుతో 1979 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరో 21 పరుగులు చేస్తే ఆసీస్ పై 2000 పరుగులు మార్కును కోహ్లీ అందుకుంటాడు.
- ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్ మెన్ గా రాహుల్ ద్రావిడ్ పేరిట రికార్డు ఉంది. అతను 2,645 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. 2,626 పరుగులతో సచిన్ రెండో స్థానంలో ఉన్నాడు. 2,574 పరుగులతో కోహ్లీ మూడో ప్లేస్ లో ఉన్నాడు. ఈ క్రమంలో మరో 52 పరుగులు చేస్తే సచిన్ రికార్డును..71 పరుగులు చేస్తే ద్రావిడ్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు.
- అంతర్జాతీయ క్రికెట్లో ఒక బౌలర్ పై ఒక బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు పుజారా పేరిట ఉంది. అతను నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా) బౌలింగ్ లో 570 పరుగులు చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) బౌలింగ్ లో స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా) 520 పరుగులు కొట్టాడు. సయీద్ అజ్మల్ (పాకిస్థాన్) పై కుమార సంగక్కర (శ్రీలంక) 531 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ నాథన్ లియోన్ బౌలింగ్ లో 511 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో కోహ్లీ నాథన్ లియోన్ బౌలింగ్ లో అధిక పరుగులు సాధిస్తే మరో రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.
- ఐసీసీ నాకౌట్ స్టేజ్లో కోహ్లీ ఇప్పటి వరకు 620 పరుగులు సాధించాడు పాంటింగ్ 731 పరుగులు, సచిన్ 657 పరుగులు చేశారు. కోహ్లీ మరో 111 పరుగులు సాధిస్తే ఈ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.
- ఐసీసీ ఫైనల్స్‌లో సెంచరీ చేసిన ఏకైక భారత బ్యాటర్ సౌరవ్ గంగూలీ. 2000లో గంగూలీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేస్తే రికార్డు సృష్టిస్తాడు.
- ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో సచిన్ (11 సెంచరీలు) ముందున్నాడు. తర్వాతి స్థానంలో సునీల్ గవాస్కర్, కోహ్లీ (8 సెంచరీలు) ఉన్నారు. మరో సెంచరీ చేస్తే కోహ్లీ సునీల్ గవాస్కర్ను అధిగమిస్తాడు.