సొంతగడ్డపై ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్న టీమిండియాకు.. న్యూజిలాండ్ అడ్డుకట్ట వేసింది. భారత క్రికెట్ అభిమానులందరూ మెచ్చిన బెంగుళూరు వేదికపై రోహిత్ సేనకు ఓటమి రుచి చూపెట్టింది. ఆతిథ్య జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి.. 36 ఏళ్ల నిరీక్షణకు కివీస్ తెరదించింది. ఈ గెలుపు అనంతరం కివీస్ ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. 36 ఏళ్ల తరువాత విజయం లభించడంతో కివీస్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చప్పట్లతో మార్మోగింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్..?
ఈ ఓటమి తరువాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో భారత్ పాయింట్ల శాతం 74.24 నుంచి 68.05కి పడిపోయింది. అయినప్పటికీ, అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంటే, ఈ ఓటమి ప్రభావం భారత జట్టుపై పెద్దగా లేనట్టే. ఇప్పటివరకు ఆడిన 12 టెస్టుల్లో 8 విజయాలు సాధించిన భారత్.. మూడింట ఓడి ఒక దానిని డ్రా చేసుకుంది. దాంతో, టీమిండియా ఖాతాలో 98 పాయింట్లు ఉన్నాయి. తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి.
ఆసీస్ పర్యటన కీలకం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో భారత జట్టు ఫైనల్ చేరాలంటే, మొదటి రెండు స్థానాల్లోనే నిలవాలి. అలా జరగాలంటే, తదుపరి ఆడబోయే ఏడు టెస్టుల్లో నాలుగింట విజయం సాధించాలి. అదే సమయంలో ఇతర మ్యాచ్ ల్లో పాయింట్ల కోత పడకుండా చూసుకోవాలి. ఈ సిరీస్ లో న్యూజిలాండ్ తో ఇంకా రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో విజయం లాంఛనమే. ఒకవేళ విజయం సాధించకపోయినా.. 'డ్రా'తో సరిపెడతారు. అదీ ఓ రకంగా మంచికే.
తదుపరి బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అతిథ్య ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో తలపడాలి. ఈ పర్యటన భారత జట్టుకు చావో రేవో లాంటిది. కమ్మిన్స్, స్టార్క్, హేజెల్‌వుడ్ త్రయాన్ని దాటి ఆసీస్ గడ్డపై విజయం సాధించడమంటే, అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. కుర్రాళ్లు రాణిస్తున్నా.. నిలకడకు పెట్టింది పేరైన కోహ్లీ, రాహుల్ వంటి వారు బ్యాట్ ఝుళిపించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కంగారూల గడ్డపై భారత బ్యాటర్లు ఏమాత్రం రాణిస్తారనేది ఆసక్తికరం. క్లిష్ట పరిస్థితులు రాకుండా ఉండాలంటే, కివీస్‌తో జరగబోయే తదుపరి రెండు టెస్టుల్లో విజయం సాధించాలి.