సమానత్వమే మహిళలకు మనం ఇచ్చే గౌరవం : రాష్ట్ర డీజీపీ జితేందర్  

సమానత్వమే మహిళలకు మనం ఇచ్చే గౌరవం : రాష్ట్ర డీజీపీ జితేందర్  
  • రాచకొండ కమిషనరేట్​లో మహిళల కోసంWW స్పెషల్​ జాబ్​ మేళా
  • హాజరైన 3,600 మంది మహిళలు.. 1,485 మంది ఎంపిక 
  • క్వాలిఫికేషన్​ బట్టి రూ.50వేలు వరకు జీతాలు

ఉప్పల్​, వెలుగు :స్వశక్తితో  బతికితే మహిళల ఆత్మగౌరవం మరింత పెరుగుతుందని రాష్ట్ర డీజీపీ జితేందర్ చెప్పారు. ఆదివారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీసులో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యంతో మహిళల కోసం ప్రత్యేకంగా జాబ్​మేళా నిర్వహించారు. వివిధ కంపెనీలు పాల్గొన్నాయి. టెన్త్​నుంచి ఎంబీఏ, బీటెక్, ఎంటెక్​పూర్తిచేసిన 3,600 మంది మహిళలు హాజరయ్యారు. 1,485 మందిని సాఫ్ట్​వేర్, మార్కెటింగ్​కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి.

ముఖ్య అతిథులుగా డీజీపీ జితేందర్, రాచకొండ సీపీ సుధీర్ బాబు పాల్గొని ఎంపికైన వారికి అపాయింట్​మెంట్​లెటర్లు అందజేశారు. డీజీపీ మాట్లాడుతూ.. సమాజంలో సగభాగమైన మహిళలను గౌరవించడం ప్రతిఒక్కరి విధి అన్నారు. గృహిణిగా, తల్లిగా, టీచర్​గా, స్నేహితురాలిగా, కూతురిగా పురుషుడి విజయంలో, సుఖసంతోషాల్లో మహిళ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు.

స్త్రీలు ఇంటికి పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదివాలని, విభిన్న నైపుణ్యాలను, మేధస్సును ఉపయోగించుకొని అర్హతకు తగిన ఉద్యోగం పొందాలన్నారు. కార్యక్రమంలో డీసీపీలు పీవీ పద్మజ, అక్షాంశ్ యాదవ్, ప్రవీణ్ కుమార్, అరవింద్ బాబు, ఇందిర, శ్రీనివాసులు, ఉషా విశ్వనాథ్, మనోహర్, జి.నరసింహారెడ్డి, రమణారెడ్డి, శ్యామ్ సుందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.