- మెయిన్ అట్రాక్షన్‌గా జాన్ సీనా
హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లు టీవీల్లో మాత్రమే చూసిన డబ్ల్యూడబ్ల్యూఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్) ఫైట్స్‌ను హైదరాబాద్ ఫ్యాన్స్ ప్రత్యక్షంగా చూసి మైమరిచిపోయారు. వరల్డ్ ఫేమస్ స్టార్లు, తమ అభిమాన రెజ్లర్ల ఫైట్లకు ఫిదా అయ్యారు. ఆరేండ్ల తర్వాత ఇండియాకు, తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన ప్రొఫెషనల్ రెజ్లర్లు రింగ్‌లో కొదమ సింహాల్లా కొట్లాడి హైదరాబాదీలను ఉర్రూతలూగించారు. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్స్ స్పెక్టకిల్‌లో భాగంగా శుక్రవారం రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్ ఆద్యంతం అలరించింది. డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్, 16 సార్లు చాంపియన్ అయిన జాన్ సీనా హైలైట్‌గా నిలిచాడు-.
అతను రింగ్‌లోకి రాగానే అభిమానుల అరుపులు, కేరింతలకు స్టేడియం దద్దరిల్లింది. మెయిన్ ఈవెంట్, చివరిదైన టీమ్ ట్యాగ్ మ్యాచ్‌లో ప్రస్తుత హెవీ వెయిట్ చాంపియన్ సేత్ రోలిన్స్ జతగా బరిలోకి దిగిన సీనా తన మార్కు ఆట చూపెట్టాడు. సూపర్ ఫైట్‌తో తమ ప్రత్యర్థులు గియోవనీ విన్సీ, లుడ్విగ్ కైజర్‌ను ఓడించాడు. జాన్ సీనా ఆట చూసేందుకు ఎన్నో ఏండ్ల నీరిక్షణ ఫలించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తనకు ఇంత మద్దతు ఇచ్చిన ఫ్యాన్స్‌ను సీనా థ్యాంక్స్ చెప్పాడు. ఇండియాలో ఆడాలని 20 ఏండ్లుగా అనుకుంటున్నానని తెలిపాడు. ఈ జ్ఞాపకాలను చిరకాలం గుర్తుంచుకుంటానని అన్నాడు.
ఈ ఈవెంట్‌లో భాగంగా మొత్తం ఆరు పోటీలు నిర్వహించారు. మొదటిదైన 6-–మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ఇండియాకు చెందిన సంగా, వీర్ మహాన్, జిందర్ మహల్‌తో కూడిన ఇండస్ షేర్‌ను ఓవెన్స్, సమీ, మెకింటైర్ ఓడించారు. ఫైట్ తర్వాత వీరంతా నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. మెన్స్ సింగిల్స్‌లో జనరల్ గుంతర్.. షాంకీపై విజయం సాధించి ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకున్నాడు. వరల్డ్ విమెన్స్ చాంపియన్‌షిప్ ఫైట్‌లో డిఫెండింగ్ చాంప్ రియా రిప్లే.. నటల్యాను ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది.
ఇండియా స్టార్ రెజ్లర్ గ్రేట్ ఖలీ, క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్, హీరో కార్తీ తదితర సెలబ్రిటీలు, భారీ సంఖ్యలో ఫ్యాన్స్ హాజరవడంతో స్టేడియం కిక్కిరిసింది.