విచారణకు సర్వం సిద్ధం.. మణిపూర్‌ వీడియోపై సుప్రీంను ఆశ్రయించిన బాధిత మహిళలు

విచారణకు సర్వం సిద్ధం.. మణిపూర్‌ వీడియోపై సుప్రీంను ఆశ్రయించిన బాధిత మహిళలు

గత కొన్ని నెలలుగా కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న కేంద్రం అభ్యర్థనను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. కేంద్రం, మణిపూర్ ప్రభుత్వంపై బాధిత మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా చర్యలు తీసుకుని నిష్పక్షపాతంగా, విచారణకు ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. బాధితులు తమ గుర్తింపును కాపాడాలని కూడా పిటిషన్లో అభ్యర్థించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను కోర్టు పత్రాలలో "X","Y" గా పేర్కొన్నారు. ఐజీ-ర్యాంక్ పోలీసు అధికారి నేతృత్వంలో స్వతంత్ర సిట్ నేతృత్వంలో విచారణ జరిపించాలని, విచారణను రాష్ట్రం వెలుపలకు బదిలీ చేయాలని వారు కోరారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదన్న బాధితులు.. తమకు భద్రత కల్పించాలని, సీఆర్పీసీలోని సెక్షన్ 164 కింద తమ స్టేట్‌మెంట్‌ను రికార్డింగ్ చేయడానికి సమీప ప్రాంత మేజిస్ట్రేట్‌ను ఆదేశించాలని కోరారు. కేంద్రం ఇప్పటికే ఈ కేసును సీబీఐకి బదిలీ చేసిన తరుణంలో తాజాగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

విజువల్స్‌లో "రాజ్యాంగ వైఫల్యం" ఉందని పేర్కొంటూ "తీవ్రంగా కలవరపరిచే ఈ వీడియోను సుప్రీంకోర్టు గత వారం ఖండించింది. ఈ ప్రాంతంలోని మహిళల రక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, వారి పురోగతిని కోర్టుకు తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. విచారణను రాష్ట్రం నుంచి తరలించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. ఆరు నెలల్లోగా విచారణ పూర్తయ్యేలా చూడాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఇద్దరు మహిళల వీడియోపై విపక్ష నేతల నుంచి సైతం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పొలంలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మణిపూర్‌లోని ఓ గిరిజన సంస్థ ఇప్పటికే ఆరోపించగా.. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగిందని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్‌ఎఫ్) పేర్కొంది. అయితే, కంగ్‌పోక్పిలో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినప్పటికీ, ఈ సంఘటన వేరే జిల్లాలో జరిగిందని పోలీసులు అంటున్నారు.

మణిపూర్‌లో జాతి హింసకు సంబంధించిన పలు పిటిషన్‌లపై సుప్రీంకోర్టు జూలై 28న విచారణ చేపట్టాల్సి ఉండగా, సీజేఐ చంద్రచూడ్‌ అస్వస్థతకు గురికావడంతో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో మణిపూర్ ప్రభుత్వం, జూలై 27న సీబీఐ విచారణకు హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు.