బీజింగ్: మన దేశంతో బార్డర్ వివాదం కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా మధ్య కుదిరిన పంచశీల ఒప్పందం చరిత్రాత్మకమైనదని అన్నారు. ఆ ఒప్పందంలోని ఐదు సూత్రాలు అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ చట్టాలకు చారిత్రక ప్రమాణాలను నిర్దేశించాయని తెలిపారు. అవి ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న గొడవలకు ముగింపు పలకడానికి దిశానిర్దేశం చేస్తాయని చెప్పారు. రెండు దేశాల మధ్య పంచశీల ఒప్పందం జరిగి 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం బీజింగ్ లో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో జిన్ పింగ్ మాట్లాడారు. ‘‘పంచశీల ఒప్పందం ఒక చారిత్రక పరిణామం. అందులోని ఐదు సూత్రాలు శాంతి, అభివృద్ధికి సమాధానం ఇచ్చాయి.
‘సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవడం.. దాడులు, ఆక్రమణలకు దిగకపోవడం.. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం.. సమానత్వం, పరస్పర ప్రయోజనం.. శాంతియుత సహజీవనం’ అనే ఐదు సూత్రాలను గతంలో మా నాయకత్వం చైనా–ఇండియా, చైనా–మయన్మార్ సంయుక్త ప్రకటనల్లో చేర్చింది. మొదట ఈ ఒప్పందం ఆసియాలో పుట్టింది. ఆపై ప్రపంచమంతటా విస్తరించింది. 1960లో మొదలైన అలీనోద్యమానికి మార్గదర్శకంగా నిలిచింది” అని అన్నారు. ప్రపంచ భద్రత కోసం తాము తీసుకొస్తున్న గ్లోబల్ సెక్యూరిటీ ఇనీషియేటివ్‌లో ఈ ఐదు సూత్రాలను భాగం చేస్తామని చెప్పారు. ‘‘సౌత్ దేశాలకు మద్దతు ఇచ్చేందుకు గ్లోబల్ సౌత్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. అదే విధంగా గ్లోబల్ సౌత్ యూత్ లీడర్స్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తాం. వచ్చే ఐదేండ్లలో సౌత్ దేశాల్లో వెయ్యి ‘ఫైవ్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ పీస్ ఫుల్ కోఎగ్జిస్టెట్స్ స్కాలర్ షిప్ ఆఫ్ ఎక్సలెన్స్’ అందజేస్తాం” అని వెల్లడించారు.