ఇప్పుడు స్మార్ట్ఫోన్లలో అట్రాక్టివ్ ఫీచర్ కెమెరానే. ఎంత మంచి కెమెరా ఉంటే ఆ ఫోన్ అంతగా సక్సెస్ అవుతోంది. అందుకే కంపెనీలు మార్కెట్ కాపాడుకునేందుకు అడ్వాన్స్డ్ కెమెరాలతో ఫోన్లను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే 48ఎంపీ కెమెరాలతో కొన్ని ఫోన్లు ఆకట్టుకుంటుంటే, త్వరలో 108 ఎంపీ కెమెరా ఫోన్లు రాబోతున్నాయి. కొరియాకు చెందిన సామ్సంగ్, చైనాకు చెందిన షావోమీ సంస్థలు కలిసి 108ఎంపీ కెమెరాను రూపొందిస్తున్నాయి. ఈ ఏడాది చివరికల్లా విడుదలయ్యే ఫోన్లలో 108 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాయి రెండు సంస్థలు.
‘ఐసోసెల్ బ్రైట్ హెచ్‌ఎమ్‌ఎక్స్’ సెన్సర్ ద్వారా 108 ఎంపీ కెపాసిటీ కలిగిన కెమెరాను రూపొందిస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మొబైల్ ఫోన్లలో ఒక సెన్సేషన్‌గా చెప్పాలి. ఎందుకంటే 108 ఎంపీ కెపాసిటీ ‘హైఎండ్ డీఎస్ఎల్ఆర్’ కెమెరాల్లో మాత్రమే ఉంటుంది. కానీ, త్వరలో ఇది స్మార్ట్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంటుంది. ఈ కెమెరాతో సెకన్‌కు 30 ఫ్రేమ్‌లతో 6కె వీడియోలు తీయొచ్చు. దీనికంటే ముందే షావోమీ సంస్థ 64 ఎంపీ కెమెరాను మార్కెట్లోకి తీసుకొస్తుంది.