
మెట్రో నగరాల్లో వెండింగ్ మెషిన్లు కామన్ అయిపోయాయి. కూల్‌డ్రింక్స్, బొమ్మలు, ఐస్‌క్రీమ్స్.. ఇలా ఒకటేమిటి అనేక రకాల ఉత్పత్తులు వెండింగ్ మెషిన్లలో దొరుకుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి స్మార్ట్ఫోన్లు కూడా చేరనున్నాయి. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘షావోమి’ మన దేశంలో స్మార్ట్‌ఫోన్ వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయబోతోంది. ఒక మొబైల్ సంస్థ ఇలా వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయనుండటం దేశంలో ఇదే తొలిసారి. ‘ఎమ్ఐ ఎక్స్‌ప్రెస్ కియోస్క్’గా పిలిచే స్మార్ట్‌ఫోన్ వెండింగ్ మెషిన్లను షావోమి పలు ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయనుంది. మెట్రో స్టేషన్లు, టెక్‌పార్కులు, ఎయిర్‌పోర్టులు, షాపింగ్ మాల్స్‌లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఎమ్ఐ ఫోన్లు ఎక్కువగా ఆన్లైన్లోనే దొరుకుతుంటాయి. అయితే ఆఫ్లైన్మార్కెట్ను కూడా విస్తరించే చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. వినియోగదారులు క్యాష్, క్రెడిట్, డెబిట్ కార్డులు, యూపీఐ విధానంలో డబ్బులు చెల్లించి నచ్చిన షావోమి మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలు కొనుగోలు చేయొచ్చు.