యాదాద్రి భువనగిరి జిల్లాలో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామ శివారులో వలస కూలీలను తీసుకెళ్తున్న టాటా ఏస్ వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో వాహనంలో 15 మంది కూలీలకు గాయాలయ్యాయి.
వారందరిని భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించామని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం సమయంలో టాటా ఏస్ వాహనంలో ప్రయాణించిన వారంత ఆంధ్రప్రదేశ్ బాపట్లకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.