ఇద్దరు డాక్టర్లు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు

ఇద్దరు డాక్టర్లు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు

చౌటుప్పల్ వెలుగు : విధులకు హాజరుకాని ఇద్దరు డాక్టర్లు, మరో ఇద్దరు వైద్య సిబ్బందికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. విధులకు హాజరుకాని జనరల్ సర్జన్ డాక్టర్ వివేక్, నాచురోపతి డాక్టర్ గీత, కాంపౌండర్లు అశ్విని, మెర్సీ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని ఫార్మసిస్టుతో మాట్లాడి మందులపై ఆరా తీశారు. అనంతరం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డాక్టర్స్ సమయపాలన పాటించాలని సూచించారు. ఆయన వెంట చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, వైద్యులు, అధికారులు ఉన్నారు.