రుణాలు సత్వరమే మంజూరు చేయాలి

రుణాలు సత్వరమే మంజూరు చేయాలి

యాదాద్రి, వెలుగు : మహిళలు, రైతులకు సత్వరమే రుణాలు మంజూరు చేయాలని, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో నిర్వహించిన బ్యాంకర్ల మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించి, వారికి ఇంట్రెస్ట్​ ఉన్న రంగాల్లో రాణించడానికి రుణాలు అందించాలని సూచించారు. సామాజిక, ఆర్థిక స్థిరత్వం సాధించడంలో మహిళల పాత్రను పెంపొందించేందుకు రుణాలు ఇవ్వాలని చెప్పారు. 

స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాదిలో రూ.614 .31 కోట్ల రుణం అందించాలని తెలిపారు. ఇప్పటివరకు రూ.523.15 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. అనంతరం నాబార్డ్​ పొటెన్షియల్ లింక్డ్  ప్లాన్ 2025-–-26 పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్​డీవో నాగిరెడ్డి, సీఈవో శోభారాణి, లీడ్ బ్యాంకు మేనేజర్​ శివరామకృష్ణ, ఆర్‌‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లక్ష్మి, నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వినయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్, పరిశ్రమల అధికారి రవీందర్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. 

యావాపూర్ లో గల్లీగల్లీ తిరిగిన కలెక్టర్..

యాదగిరిగుట్ట, వెలుగు : బొమ్మలరామారం మండలం యావాపూర్ గ్రామంలో ఉదయం 6:30 గంటలకు మండల స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్​హనుమంతరావు గల్లీగల్లీ కలియ తిరిగారు. గడపగడపకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలో అధిక శాతం రైతులు కూరగాయలు, ఆకు కూరలు పండిస్తారని తెలుసుకున్న ఆయన.. వెంటనే ఆర్గానిక్ శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రైతులకు పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు.

 అదేవిధంగా గ్రాంలో కరెంట్, రోడ్ల సమస్యను పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూల్ మూసివేశారని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వచ్చే ఏడాది నుంచి స్కూల్ రీఓపెన్ చేసి టీచర్ ను అలాట్ చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్ చేర్పించాలని, ఇందుకోసం అందరూ కలిసి తీర్మానం చేసుకోవాలని సూచించారు. అనంతరం తుర్కపల్లి మండలం మాదాపూర్ లో ప్రభుత్వ స్కూల్ ను విజిట్ చేశారు.