- స్కూళ్లలో వందశాతం ఎన్రోల్ చేయాలి
- ఎట్టిపరిస్థితుల్లో డ్రాపవుట్స్ ఉండొద్దు
- రివ్యూ మీటింగ్‌లో యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి, వెలుగు : అడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే జూన్‌లో నిర్వహించే బడిబాటను ఇప్పుడే ప్రారంభించాలని ఆఫీసర్లను యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా వంద శాతం పిల్లలను స్కూళ్లలో చేర్పించాలని సూచించారు. 2023–24 ఎడ్యూకేషన్ఇయర్పై సోమవారం కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్జరిగింది. ఈ సందర్భంగా క్లాస్‌ల వారీగా స్డూడెంట్స్ డిటైల్స్‌ను ఎడ్యూకేషన్ ఆఫీసర్లు వివరించారు. అనంతరం బడిబాటపై కలెక్టర్ మాట్లాడారు. ఐదేండ్లున్న ప్రతి చిన్నారిని ప్రభుత్వ స్కూల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉపాధి కోసం వలస వచ్చిన వారిని గుర్తించి, వారి పిల్లలను స్కూళ్లలో చేర్పించాలని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో స్టూడెంట్స్ నమోదు శాతాన్ని గతం కన్నా పెంచాలని ఆదేశించారు. ఇందుకు స్కూళ్ల యాజమాన్య కమిటీలోని పేరెంట్స్ సాయాన్ని టీచర్లు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతో కొందరు పిల్లలకు చదువును మధ్యలోనే ఆపేస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అలాంటి పిల్లలను గుర్తించి వారిని చదువుకునేందుకు ప్రోత్సహించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్స్ లేకుండా చూడాలని చెప్పారు. స్టూడెండ్స్ సంఖ్యను పెంచడంతోనే సరిపెట్టకుండా వంద శాతం హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి స్కూల్లో రీడింగ్ కార్నర్ ఉండేలా చూడాలని చెప్పారు. నెలకు రెండుమార్లు పేరెంట్స్ మీటింగ్, స్వయం సహాయక మహిళా సమాఖ్య సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. టెన్త్ క్లాస్ తర్వాత స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజీలు కాకుండా ప్రభుత్వ కాలేజీలలో చేరే విధంగా చూడాలని సూచించారు. మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, డీఈవో నారాయణరెడ్డి, డీపీవో సునంద, బీసీ, ఎస్సీ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఆఫీసర్లు యాదయ్య, జైపాల్‌రెడ్డి, వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి ఉన్నారు.