యాదగిరిగుట్ట, వెలుగు : వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతుభరోసా వర్తిస్తుందని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి, తుర్కపల్లి మండలం వేల్పుపల్లి, బొమ్మలరామారం మండలం ప్యారారం గ్రామాల్లో జరుగుతున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వేను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. రైతులకు సంబంధించిన పట్టా భూములు, అసైన్డ్ స్థలాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హుల ఎంపిక ఎంత ముఖ్యమో, అనర్హుల ఏరివేత కూడా అంతే ముఖ్యమన్నారు. నిజమైన అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించడం కోసమే సర్వే చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఇన్చార్జి తహసీల్దార్, తుర్కపల్లి తహసీల్దార్ దేశ్యానాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.