పచ్చి పంటను కోయొద్దు! ..వరి కోత హార్వెస్టర్లపై నిఘా పెట్టాలి : డీఎస్ ​చౌహన్​

పచ్చి పంటను కోయొద్దు! ..వరి కోత హార్వెస్టర్లపై నిఘా పెట్టాలి : డీఎస్ ​చౌహన్​
  • పంట చేతికొచ్చాకే కోసేలా చూడాలి
  • ముందుగానే వరి పంట కొస్తే కేసుల నమోదు 
  • స్టేట్ సివిల్ సప్లయ్ కమిషనర్  ఆదేశాలు
  •  చర్యలకు సిద్ధమైన యాదాద్రి జిల్లా అధికారులు

యాదాద్రి, వెలుగు : ‘‘వరి కోతకు రాక ముందే పాల కంకుల దశలో  కోయడమంటే.. తల్లి కడుపులోని పిండం ఎదగకముందే హత్యకు పాల్పడినట్టే.. ఇకముందు ఇలా జరగొద్దు.. పాల కంకుల దశలో వరి పంట కోసే హార్వెస్టర్లపై నిఘా పెట్టాలి.. ముందస్తుగా పంట కొస్తే కేసులు నమోదు చేయండి’’.. అని స్టేట్ సివిల్ ​సప్లయ్ ​కమిషనర్​ డీఎస్ ​చౌహన్​ ఆదేశాలతో యాసంగి సీజన్ కోతలపై యాదాద్రి జిల్లా అధికారులు దృష్టి సారించారు.

 ప్రధానంగా వరి కోత మెషీన్ల వివరాలు తీసుకునే పనిలో ఉన్నారు. పాల కంకుల దశలోనే  రైతులు వరి కోతలు కోస్తూ వడ్లను సెంటర్లకు తెస్తుండగా.. తేమ శాతం అధికంగా ఉంటుండడంతో  కొనుగోలులో  లేట్ అవుతుంది. దీంతో  రైతులతో పాటు అధికారులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు.  

వరి సాగులో రాష్ట్రం టాప్​ 

రాష్ట్రంలో వరి సాగుపైనే రైతులు ప్రధానంగా దృష్టి సారిస్తుండగా కొన్నేండ్లుగా టాప్​లో నిలుస్తుంది. ఈసారి యాసంగిలో 60 లక్షల ఎకరాలకు పైగా రైతులు వరి పంట సాగు చేశారు. ఈ సీజన్​లో ఎక్కువగా దొడ్డు రకం వేయగా ఎకరానికి 25 క్వింటాళ్లకు పైగా వడ్ల దిగుబడి వచ్చే చాన్స్ ఉందని ఆఫీసర్ల లెక్కల ద్వారా తెలుస్తోంది. ధాన్యం కొనుగోలుకు  సివిల్​సప్లయ్​ డిపార్ట్​మెంట్ సిద్ధంగా ఉంది.  వచ్చే నెల నుంచి కొనుగోలు ప్రక్రియ చేపట్టడానికి ప్లానింగ్​చేసుకుంటుంది. సెంటర్లకు అనుగుణంగా అవసరమైన గన్నీ బ్యాగులు, తేమ మెషీన్లు టార్పాలిన్లు సమకూర్చుతుంది. 

ముందస్తు కోతలకు రెడీ

వరి కోతలకు ఇంకా సమయం ఉంది.అయినప్పటికీ.. ఈ సీజన్ లో వడగండ్ల వానలు కురిసే చాన్స్ లేకపోలేదు. దీంతో  రైతులు ఆందోళన చెందుతుండగా.. ఆపై కూలీల కొరత వేధిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీనికి తోడు వరి కోతలకు వినియోగించే హార్వెస్టర్లు సమయానికి దొరుకుతాయో..? లేవో..? అనే అనుమానంతో కొందరు రైతులు పాల కంకుల దశలోనే కోతలు కోస్తుంటారు.  

తద్వారా రైతులతో పాటు అధికారులకు ప్రతి సీజన్​లో ఇబ్బందికర పరిస్థితులు వస్తుంటాయి.  రూల్స్​ మేరకు 17 శాతం తేమ ఉంటేనే వడ్లను కొనుగోలు చేస్తారు. పాల కంకుల దశలోనే కోసిన వడ్లను సెంటర్లకు రైతులు తీసుకెళ్తుండగా  తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో తేమ తగ్గే వరకూ కాంటా వేయడం లేదు. దీంతో కొందరు రైతులు వారాల తరబడి సెంటర్లలోనే ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరోవైపు సెంటర్లలో జాగా ఉండదు. మిల్లర్లు కూడా తేమ వల్ల నూక శాతం పెరుగుతుందని కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపడంలేదు. అంతేకాదు బహిరంగ మార్కెట్లో ధర కూడా తగ్గిస్తున్నారు. 


ఈసారి కంకుల దశలో కోస్తే కేసులే..

 ఈసారి పాల కంకుల దశలో వరి కోతలను నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే స్టేట్ సివిల్ సప్లయ్​ కమిషనర్​ఇటీవల ఆఫీసర్లతో మీటింగ్​నిర్వహించారు. ఈసారి ముందస్తు వరి కోతలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు.  హార్వెస్టర్ల జాబితా రెడీ చేసి వాటి యజమానులను గుర్తించాలని సూచించారు. ఇందుకు డీఏవో, డీసీఎస్​వో, పోలీసు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, హార్వెస్టర్ల యజమానులతో ఈనెల 18న మీటింగ్​లు నిర్వహించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.  ఈసారి పాల కంకుల దశలో వరి కోతలు కోస్తే కేసులు నమోదు చేయాలని ఆయన స్పష్టంచేశారు.