4 ఇంచుల జాగ కోసం హత్య.. 8 మందికి యావజ్జీవశిక్ష

  • అందరూ రెండు కుటుంబాలకు చెందిన వారే 
  • దోషుల్లో ముగ్గురు మహిళలు

యాదాద్రి, వెలుగు :  పాలోళ్ల మధ్య నాలుగు ఇంచుల గోడ పంచాయితీ ఒకరి హత్యకు దారి తీసింది. 2020లో జరిగిన ఈ హత్య కేసులో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు మహిళలతో సహా 8 మందికి యావజ్జీవ శిక్ష పడింది. శిక్ష పడిన వారిలో తండ్రీకొడుకులు, భార్యాభర్తలున్నారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం చల్లూరుకు చెందిన చెట్కూరి అయిలయ్య (తండ్రి మల్లయ్య), చెట్కూరి అయిలయ్య(తండ్రి నర్సయ్య), చెట్కూరి చిన్న నర్సయ్య అన్నదమ్ముల పిల్లలు. ఈ మూడు కుటుంబాలకు సంబంధించిన ఇంటి జాగ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చెట్కూరి అయిలయ్య (తండ్రి నర్సయ్య) నాలుగు ఇంచులు ముందుకు జరిపి ఓ గోడ కడుతున్నాడు.

దీంతో మరో అయిలయ్య, చిన్న నర్సయ్య, అతడి కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఘర్షణ మొదలై ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.  ఏప్రిల్1,2020లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన చెట్కూరి అయిలయ్య (తండ్రి నర్సయ్య) చనిపోయాడు. ఈ కేసులో నేరం నిరూపణ కావడంతో ఎనిమిది మందికి యావజ్జీవ ఖైదు విధిస్తూ జిల్లా ఫస్ట్​క్లాస్​అడిషనల్​జడ్జి తీర్పు చెప్పారు.ఒక్కొక్కరికి రూ. 4500 చొప్పున జరిమానా విధించారు. చెట్కూరి అయిలయ్య(తండ్రి మల్లయ్య), ఆయన కుటుంబానికి చెందిన లక్ష్మి, కుమార్​, చెట్కూరి చిన్న నర్సయ్యతో పాటు వారి కుటుంబానికి చెందిన యాదగిరి, స్వామి, అరుణ, లక్ష్మికి ఈ శిక్ష పడింది.  తీర్పు తర్వాత శిక్ష పడిన 8 మందిని భువనగిరి ఏరియా దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారు.