
- ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారుల స్పెషల్ డ్రైవ్
- ఎన్ని బోర్లున్నయ్.. ఎన్ని పని చేస్తున్నయ్..
- మిషన్ భగీరథ వాటర్ సరఫరా..పైప్లైన్ల పరిస్థితిపై ఆరా
- ప్రత్నామ్నాయ మార్గాల అన్వేషణ
యాదాద్రి, వెలుగు :ఎండాకాలం సమీస్తుండడంతో నీటి ఎద్దడి నివారణకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్నిర్వహిస్తోంది. మిషన్ భగీరథ వాటర్సరిపోతోందా..? ఎన్ని బోర్లు ఉన్నాయ్.. ఎన్ని పని చేస్తున్నాయ్.. అని ఆరా తీస్తోంది.
యాదాద్రి జిల్లాలో 9 లక్షలకు పైగా జనాభా..
ఇటీవల నిర్వహించిన కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలో 2,60,559 కుటుంబాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 7,70,833 మంది ఉండగా, ప్రస్తుతం 9 లక్షల మందికి పైగా జనాభా ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ జనాభాకు నీటి అవసరాలు తీర్చడానికి గ్రామాల్లోని బోరు బావులు, బావులు, చేతి పంపులు ఉన్పప్పటికీ.. నీరు సరిపోవడం లేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ కూడా పూర్తి స్థాయిలో అవసరాలను తీర్చలేకపోతోంది.
అవసరం 80 ఎంఎల్ డీ..
జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లోని జనాభా అవసరాలకు ప్రతిరోజూ 80 ఎంఎల్డీ నీరు అవసర పడుతోంది. అయితే మిషన్ భగీరథ ద్వారా 60 ఎంఎల్డీ నీరు అందుతోంది. దీంతో గ్రామ పంచాయతీలు, హామ్లెట్లలో సింగిల్‌ఫేజ్, త్రీ ఫేజ్కలిపి మొత్తంగా 2,295 బోరు బావులు, 34 బావులు ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా సరిపోను నీరు రాకపోవడంతో బోరుబావులు, బావుల నుంచి నీటిని ట్యాంక్‌లకు సరఫరా చేసి వాటర్ సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ.. గతేడాది ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో జిల్లాలో 30 ప్రైవేట్ బోర్లను రెంట్‌కు తీసుకొని నీటి ఎద్దడి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
బోర్ల లెక్కలు తీస్తున్నరు..
ఎండాకాలంలో నీటి సమస్య ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే శనివారం నుంచి ఈ నెల 10 వరకు స్పైషల్ డ్రైవ్ చేపట్టింది. ప్రతి మండలంలో ఎంపీవో, ఏఈవో, ఏఈ, పంచాయతీ సెక్రటరీతో కూడిన టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్‌లో జిల్లాలోని 428 పంచాయతీలు, ఆవాసాల్లో ప్రజలకు అవసరమైన నీరు అందుతుందా..? సరఫరా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఆరా తీస్తున్నారు. ఏఏ మండలంలో ఎన్ని బోర్లు ఉన్నాయి..? వాటిలో ఎన్ని పని చేస్తున్నాయో తెలుసుకుంటున్నారు. అదేవిధంగా పైప్లైన్ల పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
ప్రైవేట్ బోర్ల లెక్క కూడా..
నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉంటే గతేడాదిలా ప్రైవేట్ బోర్లను రెంట్ కు తీసుకోవడానికి ముందస్తుగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. జిల్లాలో సుమారు 90 వేల బోరుబావులు, 9 వేలకు పైగా బావుల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. వీటితోపాటు గ్రామాల్లోని కొందరి ఇండ్లలో బోర్లు ఉన్నాయి. వీటిలో నీటి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే బోర్ల గురించి ఆరా తీస్తున్నారు. వాటిని రెంట్‌కు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న యజమానుల వివరాలను తీసుకుంటున్నారు. గతంలో బోరు బావులను రెంట్‌కు ఇచ్చిన వారిని సంప్రదిస్తున్నారు.
ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం
ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. తరచూ నీటి సమస్య ఏర్పడే గ్రామాలను గుర్తించి.. చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్బోర్లును కూడా రెంట్‌కు తీసుకుంటాం. - కరుణాకరన్, డీఈ, ఆర్ డబ్ల్యూఎస్, యాదాద్రి