- ప్రతిపాదిత జాబితా రెడీ
- అప్లికేషన్లకు మరో ఛాన్స్
- నేటి నుంచి నాలుగు స్కీమ్స్ పై గ్రామసభలు
యాదాద్రి, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్స్ సర్వే ముగిసింది. అయితే అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులను అందించాలన్న ఉద్దేశంతో వీటి కోసం అప్లికేషన్లు చేసుకోవడానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
నేటి నుంచి గ్రామ సభలు..
కొత్తగా అమలు చేయనున్న నాలుగు స్కీమ్స్లోలబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన సర్వే ముగిసింది. ప్రజా పాలనతోపాటు కులగణనలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం అప్లయ్చేసినవారిలో నిబంధనలకు అనుగుణంగా జాబితా రూపొందించారు. మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు 421 గ్రామాల్లో నిర్వ హించే గ్రామసభల్లో ప్రతిపాదిత జాబితాను ప్రదర్శిస్తారు. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అయితే రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ ప్రకటించిన అప్లయ్ చేసుకోని వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గ్రామసభల్లో కొత్తగా అప్లికేషన్లను స్వీకరించనున్నారు.
యాదాద్రిలో జాబితా రెడీ..
భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద చేసే సాయానికి లబ్ధిదారులను గుర్తించారు.2023–-24 ఫైనాన్సియల్ ఇయర్లో ఉపాధి హామీ స్కీమ్‌లో కనీసం 20 రోజులకు తగ్గకుండా పనిచేసిన 63,057 మందిని పరిగణలోకి తీసుకున్నారు. వీరిలో నుంచి భూమి ఉన్నవారిని గుర్తించి తొలగించారు. పైగా ఈ స్కీమ్‌ను ఫ్యామిలీని యూనిట్‌గా అమలు చేస్తున్నందున 16,927 మందిని ప్రతిపాదించారు.
70,894 రేషన్ కార్డులు..
రేషన్‌కార్డులను 70,894 మందిని అర్హులుగా గుర్తించారు. కాగా కొత్తగా పెండ్లై వేరుపడిన వారికి రేషన్‌కార్డుల కోసం అప్లయ్చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కార్డుల్లో మెంబర్ల చేరిక కోసం ఇప్పటికే అప్లయ్చేసుకున్న 43,360 పరిగణలోకి తీసుకున్నారు.
20.259 ఎకరాల్లో సాగు నో..
సాగు చేసే భూములకే రైతు భరోసా అందిస్తామని ప్రకటంచిన ప్రభుత్వం సర్వే చేయించింది. యాదాద్రి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సర్వే చేయగా, 20,259 వేల ఎకరాల్లో వెంచర్లు, కొండలు, గుట్టలు ఉన్నట్టుగా స్టాఫ్ గుర్తించారు. ఈ భూములకు సంబంధించిన సర్వే నంబర్లను రైతు భరోసా జాబితా నుంచి తొలగించనున్నారు.
79,361 ఇందిరమ్మ ఇండ్లు..
ప్రజాపాలన అప్లికేషన్లలో 2,01,977 కుటుంబాలు ఇండ్ల కోసం అప్లికేషన్లు చేసుకున్నారు. వీరిలో 1.96 లక్షల కుటుంబాల అప్లికేషన్లు చెక్ చేసి నమోదు చేశారు. అప్లికేషన్లు పరిశీలన తర్వాత 56,964 మందికి సొంతిండ్లు లేవని, 22,397 మందికి ఇండ్లతోపాటు స్థలాలు కూడా లేవని తేల్చారు. మొత్తంగా 79,361 మందికి ఇందిరమ్మ ఇండ్లకు ఎలిజిబుల్‌గా తేల్చారు. వీరిలో ప్రయారిటీ ప్రకారం ఇండ్లను మంజూరు చేయనున్నారు.