కూలి పైసల కోసం వెళ్లిన వ్యక్తి దారుణ హత్య

యాదాద్రి(రామన్నపేట), వెలుగు: యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలో ఓ వ్యవసాయ కాంట్రాక్టర్​దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా జవహర్​నగర్​కు చెందిన వి.లింగయ్య(50) వ్యవసాయ పనుల కోసం కూలీలను అరేంజ్​చేస్తుంటాడు. ఇటీవల యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంలో వరి నాట్ల కోసం కూలీలను తీసుకొచ్చాడు. 

గురువారం కూలి పైసలు వసూలు చేసేందుకు జవహర్​నగర్​నుంచి తుమ్మలగూడెం బయలుదేరిన లింగయ్య రాత్రయినా ఇంటికి చేరుకోలేదు. ఫోన్​చేసినా కలవకపోవడంతో లింగయ్య కొడుకు మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్​కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్న పోలీసులకు శుక్రవారం బోగారం-, నిదానపల్లి గ్రామాల మధ్య ఓ వ్యక్తి డెడ్​బాడీ దొరికిందని సమాచారం అందడంతో అక్కడి వెళ్లారు. లింగయ్యగా గుర్తించి, డాగ్ స్క్వాడ్, క్లూస్​ టీం రప్పించి వివరాలు సేకరించారు. డబ్బు కోసమే హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.