![భారత్ రైస్‌కు యాదాద్రి బియ్యం](https://static.v6velugu.com/uploads/2025/02/yadadri-district-selected-as-pilot-project-for-bharat-rice-initiative_tYe8xbwy4K.jpg)
- పైలట్ ప్రాజెక్టు గా జిల్లా ఎంపిక
- ఆరు మిల్లుల నుంచి10 శాతం నూకతో బియ్యం సేకరణ
- మొదటగా 10 వేల టన్నులు
- మిగిలిన 15 శాతం నూక తీసుకోనున్న ఎఫ్‌సీఐ
- మిల్లులను సందర్శించిన ఎఫ్ సీఐ టీమ్
యాదాద్రి, వెలుగు :సామాన్యులకు తక్కువ ధరకే కేంద్రం అందించే 'భారత్ రైస్' కోసం యాదాద్రి జిల్లా నుంచి బియ్యం సరఫరా కానుంది. ఇందుకోసం రాష్ట్రంలో యాదాద్రి జిల్లాను పైలట్‌ప్రాజెక్ట్‌గా ఎఫ్‌సీఐ ఎంపిక చేసింది. బియ్యం ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం 'భారత్ రైస్' విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బియ్యాన్ని ఎంపిక చేసిన స్టోర్స్‌లో విక్రయిస్తోంది. దీంతోపాటు ఆన్లైన్లో జియో మార్ట్, బిగ్‌బాస్కెట్, నాఫెడ్ బజార్లోనూ భారత్ రైస్‌ను విక్రయిస్తున్నారు.
10 వేల టన్నులు సేకరణ..
యాదాద్రి జిల్లాలో వరిని భారీగా సాగు చేస్తుండడంతో దిగుబడి ఎక్కువగానే వస్తోంది. ప్రతీ సీజన్లో మిల్లర్లు, ట్రేడర్లు కొనుగోలు చేసినా, మూడు లక్షల టన్నులకు పైగా వడ్లను సివిల్ సప్లయ్ సంస్థ సేకరించి మిల్లులకు సీఎంఆర్ కోసం అప్పగిస్తోంది. సీఎంఆర్అప్పగింతలో ఇతర జిల్లాల కంటే యాదాద్రి జిల్లా మిల్లర్లు కొద్దిగా మెరుగ్గా ఉన్నారు. అయితే భారత్ రైస్ కోసం ఎక్కువ మొత్తంలో నాణ్యమైన బియ్యాన్ని సేకరించనున్న ఎఫ్‌సీఐ యాదాద్రి జిల్లాను పైలట్‌ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది.
జిల్లాలోని ఆరు మిల్లులను ఎఫ్‌సీఐ ఎంపిక చేసింది. 10 శాతం నూకతో 10 వేల టన్నుల బియ్యాన్ని తీసుకోనుంది. బియ్యం నాణ్యతను పరిశీలించిన అనంతరం వచ్చే వానాకాలం సీజన్ నుంచి పూర్తి స్థాయిలో 10 శాతం నూకతోనే బియ్యాన్ని తీసుకునే అవకాశాలున్నాయి.
నూక లిక్కర్ సంస్థలకు..
వడ్లను మరాడిస్తే 33 శాతం పొట్టు, తవుడు పోనూ 67 శాతం బియ్యం వస్తాయి. ఈ బియ్యంలో 25 శాతం నూకతో ఎఫ్‌సీఐ సేకరిస్తోంది. అయితే భారత్ రైస్ కోసం 10 శాతం నూక ఉన్న బియ్యాన్ని ఎఫ్ఐసీ సేకరించడానికి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా మిల్లుల నుంచి 10 శాతం నూక కలిగిన బియ్యాన్ని తీసుకోనుంది. అయితే మిగిలిన 15 శాతం నూకను స్టోర్ చేయాలని సూచించడంతోపాటు వాటిని తామే తీసుకుంటామని మిల్లర్లకు ఎఫ్‌సీఐ హామీ ఇచ్చింది. ఈ నూకను బహిరంగ వేలం ద్వారా లిక్కర్ తయారీ సంస్థలకు విక్రయించే అవకాశాలూ ఉన్నాయి.
అధ్యయనం చేసిన ఎఫ్ఐసీ టీమ్..
సివిల్‌సప్లయ్ డీఎం హరికృష్ణతో కలిసి ఢిల్లీ, చెన్నైకు చెందిన ఎఫ్‌సీఐ టీమ్మెంబర్లు మూడు రోజులపాటు యాదాద్రి జిల్లాలో పర్యటించి పలు మిల్లులను సందర్శించారు. వడ్లను మరాడిస్తుండగా నూకను వేరు చేసే గ్రేడింగ్ విధానాన్ని పరిశీలించి మిల్లర్లతో మాట్లాడారు. ప్రస్తుతం వడ్లను మరాడించే విధానంలో 24 గంటల్లో 2 ఏసీకేల బియ్యం వస్తుందని, పది శాతం నూకతో బియ్యం తీయాలంటే 36 గంటలు పడుతుందని మిల్లర్లు చెప్పుకొచ్చారు.
కొత్తగా గ్రేడింగ్వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. దీని వల్ల అదనపు ఖర్చుతోపాటు లేబర్లకు కూలీ, కరెంట్ చార్జీల భారం తమపై పడుతుందని మిలర్లు తెలిపారు. పైగా 15 శాతం నూకను స్టోర్చేయడానికి రెంట్భారం కూడా మిల్లర్లపై పడుతుందన్నారు. అయితే మిగిలిన 15 శాతం నూకను కూడా తామే సేకరిస్తామని ఎఫ్‌సీఐ టీమ్ మిల్లర్లతో పేర్కొంది.