యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో నిరుపేద ఫ్యామిలీల లెక్క తేలింది. ఉపాధి హామీ స్కీమ్‌లో భాగమైన ఈ ఫ్యామిలీలకు 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' అందనుంది. ఈ మేరకు ఈనెల 26న ఈ ఫ్యామిలీలకు ఆత్మీయ భరోసా అందించనున్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ప్రతి ఆరు నెలలకు రూ.6 వేల చొప్పున ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్‌ను ప్రామాణికంగా లబ్ధిదారులను ఫ్యామిలీ యూనిట్‌గా తీసుకొని ఎంపిక చేయాలని సూచించింది. యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లోని 421 పంచాయతీల్లో 98,709 మంది కూలీలు ఉపాధి హామీ స్కీమ్‌లో జాబ్‌కార్డులు కలిగి ఉన్నారు. వీరిలో 2023–-24 ఫైనాన్సియల్ ఇయర్లో 63,057 కూలీలు 20 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు పని చేశారు.
16,927 ఫ్యామిలీలు..
ఒకే కుటుంబంలో ఒకరికి మించి ఉపాధి హామీ స్కీమ్‌లో పనులు చేసినట్టయితే వారందరిని ఫ్యామిలీగా నిర్ధారిస్తారు. దీంతో గతేడాదిలో 20 రోజులు అంతకంటే ఎక్కవ పనిదినాల్లో పాల్గొన్న కూలీల్లో ఫ్యామిలీలను గ్రామీణాభివృద్ధి డిపార్ట్మెంట్ గుర్తించింది. 63,057 కూలీల డాటాను 'రైతుభరోసా' స్కీం డాటాతో అనుసంధానం చేసి వీరిలో 16,927 ఫ్యామిలీలకు భూమి లేదని నిర్ధారణకు వచ్చింది.
గుర్తించిన ఫ్యామిలీలో జాబ్‌కార్డు తీసుకోని మెంబర్లకు భూమి కలిగి ఉండి, రైతుబంధు పొందారా..? అన్న కోణంలో సర్వే చేస్తున్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభల్లో అర్హులుగా తేలిన ఫ్యామిలీ జాబితాను ప్రదర్శిస్తారు. ఈనెల 26న అర్హులను ప్రకటించనున్నారు.