
- గ్రామాల్లో ఆయా శాఖల అధికారులతో టీమ్ ఏర్పాటు చేసిన కలెక్టర్
- రైతులను సమన్వయం చేస్తూ సాగునీరు అందించడమే బాధ్యత
- ఇకపై ప్రతి సోమవారం క్షేత్రస్థాయి పరిస్థితిపై సమీక్ష
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకుండా చూడడంపై అధికారులు దృష్టిపెట్టారు. జిల్లాలో సాగునీటి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సాగర్ ఆయకట్టు భూములతో పాటు, బోర్లు, బావుల కింద సాగులో ఉన్న పంటలను కూడా కాపాడేందుకు పక్కాగా ప్లాన్ చేశారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఎలక్ట్రిసిటీ, పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈ టీమ్‌ల్లో సభ్యులుగా ఉంటారు. మండల, గ్రామాల స్థాయిలోనూ కమిటీలను ఏర్పాటు చేశారు.
యాసంగిలో లక్షల ఎకరాల్లో పంటలు..
ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ నుంచి వచ్చే కృష్ణా జలాలే ప్రధానంగా నీటి వనరు. ఎన్ఎస్పీ ఆయకట్టు కింద రెండున్నర లక్షల ఎకరాలున్నాయి. ఎస్ఆర్ఎస్పీ కాల్వలు కూడా ఉన్నాయి కానీ, ఆ నీళ్లు ఇక్కడి భూములకు అందేది అంతంత మాత్రమే. సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ కారణంగా ఇటీవల గోదావరి జలాలు వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో కొన్ని వేల ఎకరాలకు అందుతున్నాయి. ఇవి కాకుండా వాగులు, బోర్లు, బావుల కింద కలిపి దాదాపు లక్షఎకరాలకు పైగా యాసంగిలో పంటలు సాగయ్యాయి. వరితో పాటు మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటలకు నీరందించేందుకు, ఆయకట్టు చివరి భూముల్లో పంటలు ఎండకుండా ఉండేందుకు ప్రస్తుతం కమిటీలను ఏర్పాటుచేశారు.
కాల్వలు, తూములు, లిఫ్టుల కింద సాగయ్యే భూములకు చివరి వరకు నీరందేలా చూడడం, వాగులు, చెక్ డ్యామ్ లు లాంటి వాటర్ సోర్స్ లేని దగ్గర బోర్లు ఎండిపోతే, పక్క రైతులను కన్విన్స్ చేసి నీటిని ఇప్పించడం ఈ కమిటీల బాధ్యతగా అధికారులు చెబుతున్నారు. క్రమంగా గ్రామాల్లో పంటల పరిస్థితులను పరిశీలించడంతో పాటు, ప్రతి సోమవారం మండల, జిల్లా కమిటీలు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని నిర్ణయించారు. పంటలు పూర్తయ్యే వరకు ఈ కమిటీలు యాక్టివ్ గా పనిచేయనున్నాయి.
కమిటీలు ఇలా..
గ్రామస్థాయి కమిటీలో పంచాయతీ కార్యదర్శి (పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్), ఏఈవో (వ్యవసాయ శాఖ), ఏఈ లేదా ఏఈఈ (ఇరిగేషన్), లైన్ మెన్ (ట్రాన్స్ కో) సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో డీఈఈ (ఇరిగేషన్), ఏవో (అగ్రికల్చర్), ఎంపీడీవో (పంచాయతీరాజ్), తహసీల్దార్ (రెవెన్యూ), ఏఈ (ట్రాన్స్ కో) సభ్యులుగా, జిల్లా స్థాయి కమిటీలో ఖమ్మం, కల్లూరు సర్కిల్ ఎస్ఈ (ఇరిగేషన్)లు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్, డీపీవో, ట్రాన్స్ కో ఎస్ఈ, జిల్లా రెవెన్యూ అధికారి సభ్యులుగా ఉంటారు.
సాగునీటి కారణంగా ఎలాంటి గొడవలు తలెత్తకుండా ఉండేందుకు గాను పోలీస్ శాఖ అధికారులను కూడా కమిటీల్లో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. మండలాల వారీగా ఆయా కమిటీలతో వాట్సప్ గ్రూప్ లను ఏర్పాటు చేసి సమన్వయం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక జిల్లా స్థాయి అధికారులు కూడా రెగ్యులర్‌గా గ్రామాల్లో తిరుగుతూ, పంటలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను రైతులకు వివరించి వారిలో ధైర్యాన్ని నింపాలని భావిస్తున్నారు.
చింతకాని మండలంలో కలెక్టర్ పర్యటన..
ఖమ్మంటౌన్/చింతకాని, వెలుగు : -సాగర్ జలాలు కాల్వల ద్యారా సరఫరా అవుతున్న సాగునీరు ఆయకట్టు చివరి ప్రాంతాలకు అందేలా సమతుల్యతను పాటించాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. శనివారం కలెక్టర్ చింతకాని మండలంలో పర్యటించారు. అధికారులతో కలిసి మండలంలోని నాగులవంచ, సీతంపేట గ్రామాల్లో సాగర్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు సీతంపేట మేజర్ కాల్వ ద్వారా వదులుతున్న సాగునీటి ప్రవాహాన్ని పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి కెనాల్ వెంట నడుస్తూ ముచ్చటించారు.
కెనాల్ గట్టుపై కూర్చొని పొలాల్లో పంటల పరిస్థితి, సరిపడా సాగునీరు వస్తుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కరెంటు సమస్యలు వస్తున్నాయా లాంటి పలు విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. చెరువులు, ఎన్ఎస్పీ కాల్వ కట్టలు ఆక్రమణకు గురవకుండా చూడాలన్నారు. అనంతరం నీటినిర్వహణపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.
ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, నీటిపారుదల శాఖకు సంబంధించి అసిస్టెంట్ ఇంజినీరింగ్ అధికారితో సాగునీటి నిర్వహణ కమిటీ, ప్రతీ మండల తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి, పోలీస్ అధికారి, ఇరిగేషన్, విద్యుత్ అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. పంట కోతలు పూర్తయ్యే వరకు అలర్ట్‌గా ఉంటూ పంటకు నష్టం జరగకుండా చర్యలు
తీసుకోవాలని చెప్పారు.