![పంచాయతీలకు పైసలు రాక.. కరెంట్ బిల్లులు పెండింగ్](https://static.v6velugu.com/uploads/2025/02/yadadri-districts-local-bodies-owe-rs-4860-crores-in-pending-current-bills_TDm1rEbfqz.jpg)
- కరెంట్ బిల్లులు పెండింగ్
- పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 4,470 కనెక్షన్లు
- ట్రాన్స్ కోకు రూ.48.60 కోట్లు బకాయి
యాదాద్రి, వెలుగు : స్థానిక సంస్థల కరెంట్ బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి. ఎలాంటి ఫండ్స్రాకపోవడం వల్ల బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయి. దాదాపు ఆరేండ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో రూ.కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
జిల్లాలో 421 పంచాయతీలు..ఆరు మున్సిపాలిటీలు..
యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 421 గ్రామ పంచాయతీలు ఉండగా, కొత్తగా మరో ఏడు పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే ఫండ్స్‌తో పంచాయతీ అవసరాలతోపాటు కరెంట్బిల్లులు చెల్లింపులు జరిగేవి. కొన్నేండ్లుగా ఫండ్స్సరిగా రావడం లేదు. ఎస్ఎఫ్సీ కూడా సరిగా రావడం లేదు. దీంతో పంచాయతీలకు ఆస్తి, నల్లా పన్నులు, బిల్డింగ్నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఫీజులే అధారమమయ్యాయి. అయితే ఆస్తి పన్నులు కూడా సరిగా వసూలు కావడం లేదు.
పైగా వసూలు అయ్యే పన్నులు, నిర్వహణ ఖర్చు మధ్య చాలా తేడా ఉంటోంది. మోత్కూరు మండలంలోని ఓ పంచాయతీకి నెలకు దాదాపు రూ.40 వేల కరెంట్బిల్లు వస్తుంటే.. ఆ పంచాయతీలో ఏడాదికి వచ్చే ఆస్తి పన్ను కేవలం రూ.2 లక్షల లోపే ఉంటోంది. ఆ పంచాయతీ నిర్వహణతోపాటు కరెంట్ బిల్లులు కలుపుకుంటే రూ.లక్షల్లో ఉంటోంది. దాదాపు అన్ని పంచాయతీల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.
4,470 కనెక్షన్లు..
సాధారణంగా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో డ్రింకింగ్ వాటర్ పథకాలు నిర్వహణ కోసం ఉపయోగించే మోటార్లు, స్ట్రీట్ లైట్లకు సంబంధించి కరెంట్ బిల్లులను పంచాయతీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మిషన్ భగీరథ ఉన్నప్పటికీ.. అవసరమైన స్థాయిలో నీరు సరఫరా జరగకపోవడంతో బోరుబావులు, బావుల నుంచి మోటార్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి వస్తోంది. కొన్ని చిన్న పంచాయతీల్లో మోటార్లు మరమ్మతులతోపాటు స్ట్రీట్ లైట్ల నిర్వహణ కూడా భారంగా మారిపోయింది. తరచూ లైట్లు కాలిపోతున్న మార్చలేని పరిస్థితి నెలకొంది. మోటర్లు, స్ట్రీట్లైట్ల కోసం జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 4,470 కనెక్షన్లు ఉన్నాయి. వీటికి దాదాపు రూ.లక్షల్లో బిల్లు వస్తోంది.
రూ.48.60 కోట్ల పెండింగ్..
పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎప్పటికప్పుడు కరెంట్ బిల్లులు ప్రతినెలా చెల్లించకపోవడంతో అవి పేరుకుపోతున్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు కరెంట్ బిల్లులు సరైన టైంలో చెల్లింపులు జరగడం లేదు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో వచ్చిన ఫండ్స్ నుంచి గత ప్రభుత్వం కొన్ని నెలలపాటు కరెంట్ బిల్లులు చెల్లించింది. ఆ తర్వాత చెల్లించలేదు.
ALSO READ : కొత్త రేషన్ కార్డులకు మరో చాన్స్..మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ
చెల్లింపులు ప్రతినెలా సక్రమంగా చెల్లించకపోవడంతో కరెంట్డిపార్ట్మెంట్ ఫెనాల్టీ కూడా విధిస్తోంది. డిపార్ట్మెంట్ నుంచి బిల్లుల విషయంలో ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో కొన్ని పంచాయతీల్లో ఎంతో కొంత చెల్లింపులు చేస్తున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం చెల్లింపులు జరగడం లేదు. దీంతో స్థానిక సంస్థలకు కరెంట్‌బిల్లుల భారం పెరుగుతోంది. ఈ విధంగా జిల్లా మొత్తంగా రూ.48.60 కోట్లు కరెంట్ బిల్లులకు చెల్లించాల్సి ఉంది.