
- డిప్యూటేషన్ల వ్యవహారం తెరపైకి క్యాన్సిల్ చేయాలని కలెక్టర్‌కు డీఎంహెచ్‌వో నోట్ ఫైల్
- తలలు పట్టుకుంటున్న స్టాఫ్
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా వైద్యారోగ్యశాఖలో ఇంటర్నల్ వార్ నడుస్తోంది. డీఎంహెచ్‌వో, డాక్టర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఈ పరిణామాల నేపథ్యంలో డిప్యూటేషన్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. డిప్యూటేషన్లు క్యాన్సిల్ చేయాలంటూ కలెక్టర్‌కు డీఎంహెచ్‌వో నోట్ ఫైల్ పెట్టడం చర్చనీయంగా మారింది.
గూగుల్ మీట్..
యాదాద్రి జిల్లా హైదరాబాద్‌కు సరిహద్దుగా ఉంది. గంటన్నర ప్రయాణంలో హైదరాబాద్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ భువనగిరికి రావచ్చు. రూరల్ మండలాలకు వెళ్లాలంటే మరో గంట సమయం అదనంగా పడుతోంది. దీంతో ఈ జిల్లాలో హెల్త్ డిపార్ట్మెంట్సహా ప్రతి డిపార్ట్మెంట్ లో పని చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కీలకమైన వైద్యారోగ్య శాఖను గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ డిపార్ట్‌మెంట్‌పై కలెక్టర్ హనుమంతరావు దృష్టి సారించారు.
ఇందులో భాగంగా ఓపీ టైమ్ కంటే ఐదు నిమిషాల ముందే ఉదయం 8.55 గంటలకు పీహెచ్‌సీల నుంచి ప్రతిరోజూ గూగుల్ మీట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీఎంహెచ్‌వో మనోహర్ రెగ్యులర్‌గా గూగుల్‌మీట్ నిర్వహిస్తున్నారు. ఇది నచ్చని కొందరు డాక్టర్లు చూసీచూడనట్టుగా వదిలేయాలని డీఎంహెచ్‌వోను కోరగా, ఆయన తిరస్కరించారు.
డీఎంహెచ్‌వోను ప్రశ్నించిన డాక్టర్లు..
పీహెచ్సీ మెడికల్ఆఫీసర్ల గూగుల్ మీట్లో ప్రతిఒక్కరినీ వీడియో ఆన్ చేయాలని డీఎంహెచ్‌వో మనోహర్ సూచించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వీడియో ఆన్ చేయకుంటే.. మీరు డ్యూటీలో ఉన్నట్టు ఎలా తెలుస్తుందని డీఎంహెచ్‌వో చెప్పడం కొందరు డాక్టర్లకు నచ్చలేదు. తాము మహిళా డాక్టర్లమని, వీడియో ఆన్ చేయమనడం ఎంతవరకూ కరెక్ట్ అని కొందరు, నమ్మకం లేదా? అని మరికొందరు ప్రశ్నించినట్టుగా
తెలిసింది.
తెరపైకి డిప్యూటేషన్ల వ్యవహారం..
కలెక్టర్ అనుమతితో ప్రస్తుత డీఎంహెచ్‌వో మనోహర్ పది మందికి డిప్యూటేషన్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో డబ్బు చేతులు మారిందని డిపార్ట్మెంట్లో చర్చ మొదలైంది. ఈ పరిణామాల క్రమంలో గతంలో జరిగిన డిప్యూటేషన్ల వ్యవహారంపై డీఎంహెచ్‌వో మనోహర్దృష్టి పెట్టి లెక్కలు తీశారు. జిల్లా ఏర్పడిన తర్వాత బాధ్యతలు నిర్వర్తించిన డీఎంహెచ్‌వోల ఆధ్వర్యంలో మొత్తంగా 103 మంది డిప్యూటేషన్లు జరిగాయని తేలింది. ఇందులో డీఎంహెచ్‌వోగా బాధ్యతలు నిర్వహించిన పాపారావు, పరిపూర్ణాచారి హయాంలో 70 మందికి పైగా జరిగాయి.
అనంతరం ఇన్చార్జిగా వ్యవహరించిన యశోద హయాంలో కొందరు డిప్యూటేషన్లపై వెళ్లారు. ఈ డిప్యూటేషన్ల వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని, ఇందులో కొందరు కీలకంగా వ్యవహరించారని హెల్త్ డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతోంది. అయితే మొత్తంగా డిప్యూటేషన్లను రద్దు చేయాలని కలెక్టర్‌కు డీఎంహెచ్‌వో మనోహర్ నోట్‌ఫైల్ పెట్టారు. దీంతో ఏ.. ఏ పీహెచ్‌సీకి ఎంత మంది అవసరమో లెక్కలు తీసి తనకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పీహెచ్‌సీల వారీగా మెడికల్ ఆఫీసర్లతో అవసరమైన స్టాఫ్ వివరాలను తెప్పించుకున్న డీఎంహెచ్‌వో 50 మందికి పైగా డిప్యూటేషన్లు ఇవ్వాలని మరో నోట్ ఫైల్ రెడీ చేశారని హెల్త్ డిపార్ట్మెంట్ఎంప్లాయీస్ ద్వారా తెలిసింది.
రాజీ ప్రయత్నాలు..?
ఈ పరిణామాల క్రమంలో డీఎంహెచ్‌వో, డాక్టర్ల మధ్య రాజీ కుదర్చడానికి కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కొందరి కారణంగా రాజీ ప్రయత్నాల్లో ప్రతిష్టంభన నెలకొందని హెల్త్డిపార్ట్మెంట్ స్టాఫ్ చెబుతున్నారు. ఈ పరిణామాలు డిపార్ట్మెంట్కు ఇబ్బందికరంగా మారిందని స్టాఫ్ తలలు పట్టుకొని వాపోతున్నారు.