- 35 రోజుల హుండీలను లెక్కించిన ఆఫీసర్లు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి 35 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండిని మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్ కు తరలించి, హుండీలలోని కానుకలను కౌంట్ చేశారు. ఈవో భాస్కర్ రావు పర్యవేక్షించారు.
హుండీల్లో రూ.3,93,88,092 నగదు రాగా.. 174 గ్రాముల బంగారం, 7 కిలోల వెండి సమకూరిందని ఈవో తెలిపారు. అలాగే 1,359 యూఎస్ డాలర్లు, 55 ఇంగ్లాండ్ పౌండ్లు, 65 యూఏఈ దిర్హామ్స్, మలేషియా, యూరోప్, నేపాల్, కెనడా, సౌదీ అరేబియా, సింగపూర్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, మాల్దీవ్స్, మయన్మార్, కువైట్, ఖతార్, థాయ్లాండ్, బంగ్లాదేశ్ లకు చెందిన కరెన్సీ కూడా వచ్చిందని చెప్పారు. మరోవైపు హనుమాన్ టెంపుల్ లో ఆంజనేయస్వామికి నాగవల్లి దళార్చన పూజ నిర్వహించారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా మంగళవారం ఆలయానికి రూ.36,59,794 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.