కేసీఆర్ ఆదేశం..మహారాష్ట్ర సర్పంచులకు వీవీఐపీ దర్శనం.. చలికి వణుకుతూ క్యూలైన్లలోనే భక్తులు

యాదాద్రి ఆలయ నిబంధనలను ఆలయ అధికారులు తుంగలో తొక్కారు. తెలంగాణ భక్తులను అవమానపరుస్తూ..మహారాష్ట్ర నుండి వచ్చిన సర్పంచుల బృందాన్ని ప్రోటోకాల్ ఉన్న  వీఐపీలు వెళ్లే  మెయిన్ గేట్ ద్వారా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కల్పించారు. యాదగిరిగుట్ట ఆలయ తూర్పు రాజగోపురం నుంచి మహారాష్ట్రకు చెందిన 70 మంది  సర్పంచ్‌లు, వారి అనుచరులను దర్శనం కోసం అనుమతించడం  వివాదాస్పదమైంది. 

నిబంధనల ఉల్లంఘన..

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం మహారాష్ట్ర నుంచి 70 మంది సర్పంచులు, వారి అనుచరులు 100 మంది కలిపి యాదగిరిగుట్టకు వచ్చారు. వీరికి ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి ప్రత్యేక స్వాగతం పలికారు. ఆ తర్వాత వారిని ఆలయ నిబంధనలకు విరుద్దంగా  యాదాద్రి ఆలయ తూర్పు రాజగోపురం నుంచి దర్శనానికి తీసుకు వెళ్లారు.  అప్పటికే వందల సంఖ్యలో భక్తులు యాదగిరీశుడు దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చిన సర్పంచుల బృందం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులను ఆపేశారు.  మహారాష్ట్ర సర్పంచులు తీరిగ్గా దర్శించుకుని బయటకు వచ్చే వరకు భక్తులు గంటల తరబడి చలికి వణుకుతూ క్యూలైన్లలోనే బారులు తీరారు. అంతేకాదు సర్పంచుల బృందం..సెల్ ఫోన్లతో ఆలయ లోపలికి ప్రవేశించాడం గమనార్హం. 

భక్తుల ఆగ్రహం..

మహారాష్ట్ర నుంచి వచ్చిన సర్పంచుల బృందానికి తూర్పు రాజగోపురం నుంచి దర్శనం కల్పి్ంచడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన సర్పంచుల కోసం తమను గంటల తరబడి వేచి ఉంచడమేంటని ప్రశ్నించారు. వాళ్లేమైనా మంత్రులా, ముఖ్యమంత్రా..లేక ఎమ్మెల్యేలా అని నిలదీస్తున్నారు. యాదగిరి గుట్టలో ఉండే వారు కూడా స్వామివారిని దర్శించుకోవాలన్న క్యూ లైన్ లో వెళ్తున్నారని..అలాంటిది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిని రాజగోపురం నుంచి..ఆలయ అధికారులే స్వయంగా తీసుకెళ్లడం ఏంటని అడుగుతున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన యాదాద్రి ఆలయ అధికారులు  సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే ప్రొటోకాల్‌ పాటించినట్లు పేర్కొంటున్నారు. 

ALSO READ :దూమారం రేపుతున్న సుధామూర్తి కామెంట్స్

ఇస్టానుసారంగా...

మరోవైపు యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు గతంలో ప్రధానాలయ తూర్పు రాజగోపురం వద్ద స్పెషల్ దర్శనం కోసం  రూ.150 టికెట్లు ఇచ్చే వారని..అయితే  ఎలాంటి సమాచారం లేకుండానే ఈ పద్ధతిని మార్చేయడంపై భక్తులు మండిపడుతున్నారు.  ఆర్జిత సేవల టికెట్లను కూడా దర్శన క్యూ కాంప్లెక్స్‌లోనే ఇస్తున్న విషయం భక్తులకు  తెలియక తికమక పడ్డారు. సాయంత్రం స్వామి సన్నిధిలో జరిగే సహస్రనామార్చనల టికెట్లు క్యూకాంప్లెక్స్‌లోనే జారీ చేయడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు.