- గడువులోగా ఇవ్వని మిల్లర్లు
- గత వానాకాలం బియ్యం ఇంకా పెండింగ్
యాదాద్రి, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అందించడంలో యాదాద్రి మిల్లర్లు లేట్ చేస్తున్నారు. మూడు సీజన్లు గడిస్తే గానీ ఒక సీజన్ బియ్యం పూర్తిగా అందించడం లేదు. గడువులోపు బియ్యం ఇవ్వాలని ఆఫీసర్లు చెబుతున్నా.. కొందరు మిల్లర్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రైతుల వద్ద కొనుగోలు చేసిన వడ్లను మరాడించి బియ్యంగా మార్చేందుకు సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ రైస్ మిల్లర్లకు అప్పగిస్తోంది.
ఈ అప్పగించిన వడ్లలో క్వింటాల్‌కు 67 కిలోల బియ్యాన్ని సివిల్‌సప్లయ్ డిపార్ట్మెంట్కు ఇవ్వాలి. ఇందుకు గాను క్వింటాల్‌కు రూ. 33 చెల్లించడంతో పాటు నూకలు, తవుడు, పొట్టు కూడా మిల్లర్లకే అప్పగిస్తారు. సీఎంఆర్ బియ్యం వానాకాలం సీజన్ సీఎంఆర్ బియ్యం మార్చిలో, రబీ సీజన్‌కు సంబంధించిన బియ్యం సెప్టెంబర్‌లో అప్పగించాల్సి ఉంటుంది.
2.44 లక్షల మెట్రిక్ టన్నులు పెండింగ్
యాదాద్రి జిల్లాలో 2021–22 వానాకాలం సీజన్‌కు సంబంధించి 2,85,217 టన్నుల వడ్లను సివిల్ సప్లై శాఖ కొనుగోలు చేసి, 44 మిల్లులకు అప్పగించింది. ఈ వడ్లకు 1,91,095 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అందించాల్సి ఉంది. మూడో సీజన్ వడ్ల కొనుగోలు ముగుస్తున్నా ఇప్పటి వరకూ 1.65 లక్షల టన్నులను మాత్రమే మిల్లర్లు అప్పగించారు. ఇంకా 25 వేల టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. 2022–-23 యాసంగి సీజన్‌కు సంబంధించి సివిల్ సప్లయ్ 4,11,181 టన్నుల వడ్లను సేకరించి మిల్లులకు అప్పగించింది.
ఈ వడ్లను మరాడించి 2,79,603 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 60 వేల టన్నుల బియ్యాన్ని మాత్రమే అప్పగించారు. ఇంకా 2.19 లక్షల టన్నుల బియ్యాన్ని అందించాల్సి ఉంది. రెండు సీజన్లకు సంబంధించి 2.44 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉంది. ప్రస్తుతం వానాకాలం2023 సీజన్ ముగియడంతో ఇప్పటికే 2.84 లక్షల టన్నుల వడ్లను మిల్లర్లకు సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్అందించింది.
సీఎంఆర్ విషయంలో మిల్లర్లు ప్రతి సీజన్లో ఏదో ఒకసాకు చూపిస్తూ లేట్ చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని మిల్లులు సీఎంఆర్బియ్యంపైనే ఆధారపడి బిజినెస్ చేస్తుండడంతోనే లేట్ అవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఒక సీజన్‌కు సంబంధించిన బియ్యం.. మూడో సీజన్ నాటికి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. సకాలంలో ఇవ్వని మిల్లర్లను అధికారులు నిబంధనల ప్రకారం బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉన్నా... లైట్ తీసుకుంటుండడం విమర్శలకు తావిస్తోంది.