
- గంజాయి నుంచి హాష్ ఆయిల్, చాక్లెట్లు, చరాస్ పేస్ట్
- రైళ్లలో గంజాయి
- కాలేజీ బ్యాగుల్లో హాష్ ఆయిల్, ఛరాస్ పేస్ట్ రవాణా
ఏపీలోని నర్సీపట్నం మండలం గబ్బెడకు చెందిన పిట్ల శేఖర్ బీఎస్సీ కెమిస్ట్రీ చదివి ఖాళీగా ఉంటున్నాడు. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న బాల్య మిత్రుడు దుర్గారావు కలిసి నాలుగు కిలోల హాష్ ఆయిల్ ను కొనుగోలు చేశారు. కాలేజీ బ్యాగులో వేసుకుని ఈ నెల 11న ట్రైన్ లో బయలు దేరారు. మార్గమధ్యలోని భువనగిరి రైల్వేస్టేషన్ లో దిగారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లడానికి భువనగిరి మండలం అనంతారం వద్దకు చేరుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఇద్దరిని అరెస్ట్ చేసి, వారివద్ద ఉన్న కాలేజీ బ్యాగులోని 4 కిలోల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి, వెలుగు మత్తు పదార్థాల సేల్స్‌లో స్మగ్లర్లు కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా వివిధ మార్గాలు మారుస్తూ పోలీసులను ఏ మార్చి రవాణా చేస్తున్నారు. మత్తుకు అలవాటైన వారినే స్మగ్లర్లు రంగంలోకి దింపుతున్నారు. ఏవోబీ నుంచి యాదాద్రి మీదుగాయాదాద్రి జిల్లా మీదుగా మత్తు పదార్థాల రవాణా జోరుగా సాగుతోంది.
ఏపీలోని నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న మత్తు పదార్థాలను పలుమార్లు పోలీసులు పట్టుకున్నా.. దందా ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా భువనగిరిలో నాలుగు లీటర్ల హాష్ ఆయిల్‌ను పట్టుకొని, ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆంధ్రా--, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)ల్లోని అటవీ ప్రాంతాల్లో గంజాయిని సాగు చేస్తున్నారు. మల్కాన్‌గిరి నుంచి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు గంజాయి రవాణా సాగుతోంది. ఇటీవలే స్మగ్లర్లు ప్లాన్ మార్చేశారు. రైలు మార్గం ద్వారా ట్రైన్‌లోనూ రవాణా చేస్తున్నారు.
గంజాయి నుంచి ఇతర డ్రగ్స్ వరకు..
గంజాయి నుంచి ఛరాస్ పేస్ట్, చాక్లెట్లు,హాష్ ఆయిల్ తయారు చేసి అమ్ముతున్నారు. గంజాయి మొక్కల నుంచి వెలువడే గమ్ ద్వారా ఛరాస్ పేస్ట్ తయారు చేస్తున్నారు. ఎండిన గంజాయి ఆకులను సిగరెట్, చుట్ట పీల్చడానికి ఉపయోగించే వాటిలో పొగాకుతో మిక్స్ చేసి పీలుస్తారు. ఈ ఛరాస్ పేస్ట్‌ను గ్రాముల్లో అమ్ముతారు. ఇటీవల గంజాయి చాక్లెట్లను తయారు చేస్తూ రవాణా చేస్తున్నారు. గతేడాదిలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ట్రైన్లో 4500 చాక్లెట్లు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. హాష్ ఆయిల్ విషయానికొస్తే 50 కిలోల గంజాయిని ఉడికించి మరగబెడితే కిలో హాష్ ఆయిల్ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. కిలో హాష్ ఆయిల్ విలువ రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
రవాణా ఈజీ
రూట్లు మారుస్తూ పోలీసులను ఏమారుస్తూ గంజాయిని రవాణా చేస్తున్నారు. గంజాయి ప్యాకెట్లను కారు డిక్కీల్లో, సీట్ల కింద దాచిపెట్టి రవాణా చేస్తున్నారు. కొబ్బరి బోండాల లోడుతో వెళ్తున్న డీసీఎంలో ప్యాకెట్లను రవాణా చేస్తూ పట్టుపడ్డారు. వివిధ ట్రైన్లలో చిన్న పరిణామంలో ఉండే వీటిని కాలేజీ బ్యాగుల్లో పెట్టుకొని రవాణా చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో హాష్ ఆయిల్‌ను కాలేజీ బ్యాగుల్లో తరలిస్తుండగానే పట్టుకున్నారు. ఛరాస్ పేస్ట్ అయితే చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. గడిచిన రెండేళ్లలో యాదాద్రి జిల్లాలో 2700 కేజీల గంజాయి పట్టుబడింది.
15 కేజీల హాష్ ఆయిల్ పట్టుబడగా శుక్రవారం నాలుగు కేజీల హాష్ ఆయిల్ పట్టుబడింది. ఎనిమిది ప్యాకెట్లలో ఛరాస్ పేస్ట్ పట్టుబడింది. అలవాటు చేసి ఆపై బిజినెస్లోకివిద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి, హాష్ ఆయిల్ విక్రయాలు సాగుతున్నాయి. స్టూడెంట్స్ లేదా యువతను ఎంచుకొని గంజాయి, లేదా హాష్ ఆయిల్‌ను విక్రయిస్తూ వాటికి బానిసలుగా మారుస్తున్నారు. ఈ మత్తు కోసం చివరకు అదే బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నారు. గతంలో పట్టుబడిన వారిలో పలువురు తొలుత మత్తుకు అలవాటుపడి.. ఇప్పుడు బిజినెస్‌లోకి అడుగుపెట్టారని భువనగిరి పోలీసులు గుర్తించారు.