- యాక్సిలరీ బాయిలర్లను లైట్ అప్ చేసిన ఆఫీసర్లు
- త్వరలో గ్రిడ్‌కు కనెక్ట్ చేయనున్న జెన్కో
హైదరాబాద్, వెలుగు : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెండు యూనిట్లకు సంబంధించిన యాక్సిలరీ బాయిలర్లను మంగళవారం లైట్ అప్ చేశారు. దీంతో యాదాద్రి ప్లాంట్ పవర్ జనరేషన్లో చారిత్రక ఘట్టం షురూ అయింది. దశల వారీగా పవర్ జనరేషన్ చేపట్టి త్వరలో గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. ఇటీవలే యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది.
దీంతో జెన్ కో విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేసింది. దీనిలో భాగంగా మొదటి విడతగా 800 మెగావాట్లను ఉత్పత్తి చేసే రెండు యూనిట్లతో 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది.
ఈ రెండు యూనిట్లకు సంబంధించిన యాక్సిలరీ బాయిలర్లను మంగళవారం లైట్ అప్ చేశారు. ఆ తర్వాత రెండో విడతలో మరో 800 మెగావాట్ల మూడు యూనిట్లతో 24,00 మెగా వాట్లు ఉత్పత్తి చేయనున్నారు. మొత్తంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4,000 మెగావాట్ల కెపాసిటీతో యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటైంది.
ఇన్నేండ్లు బ్రేక్..
నల్గొండ జిల్లా దామరచర్లలోని వీర్లపాలెంలో ఈ థర్మల్ ప్లాంట్‌ను నిర్మించారు. రూ.30 వేల కోట్ల వ్యయంతో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో గత 2015 జూన్ 8న నిర్మాణాన్ని ప్రారంభించారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ కు గత జూన్ 26, 2017లో కేంద్రం అనుమతి ఇచ్చింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తయ్యే టైమ్‌లో ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేపడితే నల్లమల అభయారణ్యంలో ఉన్న ప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని దీని అనుమతులు రద్దు చేయాలని కోరుతూ ముంబయికి చెందిన కన్జర్వేటీవ్ యాక్షన్ ట్రస్ట్
విశాఖపట్నంకు చెందిన సమత అనే స్వచ్ఛంధ సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్జీటీ యాదాద్రి అనుమతులపై స్టే విధించింది. వన్యప్రాణులకు ఏర్పడే ముప్పుపై స్టడీ చేసి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అయితే కేంద్ర ప్రభుత్వం జారీలో జాప్యం చేసింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగడంతో పాటు గడువులోగా నిర్మాణ పనులు పూర్తి కాలేదు. టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ తో సంబంధం లేకుండా విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని జెన్కో.. గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేసింది.
ఇటీవల జెన్కో పిటిషన్ స్వీకరించిన గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతికి అవసరమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పై నివేదిక పంపాలని, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర అటవీ శాఖ సర్వే చేసి అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ యాదాద్రి ప్లాంట్ కు 14.3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెల్చి చెప్పింది. ఈ రిపోర్టు ప్రకారం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సానుకూలతను వ్యక్తం చేస్తూ పర్యావరణ అనుమతులకోసం మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేసి పంపాలని సూచించింది.
కేంద్రం సూచించిన ప్రకారం మరో విడత ప్రజాభిప్రాయ సేకరణ చేసి పంపడంతో యాదాద్రి పవర్ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాజాగా బాయిలర్లను మండించి ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభ ప్రక్రియను షురూ చేశారు.
యాక్సిలరీ బాయిలర్లు లైట్ అప్
పర్యావరణ అనుమతులు రావడంతో యాదాద్రి ప్లాంట్ ఫస్ట్ స్టేజ్‌లో భాగంగా రెండు యూనిట్లలో పవర్ జనరేషన్ కోసం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మంగళవారం యాదాద్రి పవర్ ప్లాంట్ లోని యాక్సిలరీ బాయిలర్లలో బొగ్గును మండించారు(లైట్‌అప్) దీంతో బాయిలర్ చిమ్ని నుంచి పొగలు విరజిమ్ముతూ రెండు యూనిట్ల జనరేషన్ మొదటి దశగా ప్రారంభమైనట్లయింది.
యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో చారిత్రక గట్టం లైట్‌అప్ కావడం పట్ల పవర్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ రత్నాకర్‌రావు, సెక్రటరీ జనరల్ సదానందంలు హర్షం వెలిబుచ్చుతూ విద్యుత్ ఇంజనీర్లు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.