వేగంగా పనులు చేయాలని
అధికారులకు కేసీఆర్ ఆదేశం
నిర్మా ణ పనులపై సమీక్ష
90 ఎకరాల్లో భక్తి ప్రాంగణం
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి దేవాలయాన్ని రెండుమూడు నెలల్లో ప్రారంభించేలా నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సీఎం కేసీఆర్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో శనివారం యాదాద్రి నిర్మాణంపై ఆయన సమీక్షించారు. దేశంలోనే ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాల స్థాయిలో యాదాద్రిని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఆలయ ప్రాంగణంతో పాటు టెంపుల్ టౌన్, కాటేజీలు, బస్టాండ్, గుట్టపైకి బస్సులు వెళ్లే రోడ్లు, వీఐపీ పార్కింగ్, కళ్యాణకట్ట, పుష్కరిణి ఘాట్లు, బ్రహ్మోత్సవ, కళ్యాణ మండపాల నిర్మాణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అవుట్‌పోస్టు, అన్నప్రసాదం కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, క్యూలైన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ‘‘అయోధ్య, అక్షరధామ్ లాంటి పుణ్యక్షేత్రాలకు పనిచేసిన శిల్పుల సేవలను ఆలయ నిర్మాణానికి ఉపయోగించుకోవాలి. ఆలయ చరిత్రను, గొప్పదనాన్ని భక్తులకు చాటిచెప్పేలా నిర్మాణాలు ఉండాలి. ఖాళీస్థలాల్లో వేప, రావి, సిల్వర్ ఓక్ తదితర మొక్కలు నాటాలి. పంచ నారసింహ స్వామి విగ్రహాలను తీర్చిదిద్దాలి. 250 డోనర్ కాటేజీల నిర్మాణాన్ని పూర్తిచేయాలి. ప్రతి 50 కాటేజీలకు భక్తప్రహ్లాద, అమ్మవార్ల పేర్లు పెట్టాలి” అని ముఖ్యమంత్రి సూచించారు. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణ పనులపైనా ఆయన ఆరా తీశారు. వీఐపీలతో పాటు సామాన్యులు బస చేసేందుకు వీలుగా కాటేజీలు నిర్మించాలన్నారు. వేలాది మంది హాజరయ్యేలా కళ్యాణ మండపాలు ఉండాలని చెప్పారు. 90 ఎకరాల్లో భక్తి ప్రాంగణాన్ని నిర్మించాలని, ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ఓఎస్డీ భూపాల్‌రెడ్డి, యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్, వైటీడీఏ స్పెషలాఫీసర్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, స్థపతి ఆనంద్‌సాయి తదితరులు పాల్గొన్నారు.
For More News..