యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. 28 రోజుల్లో హుండీల్లో భక్తులు వేసిన కానుకలు లెక్కించగా రూ.3,15,05,035 నగదు వచ్చింది. ఈవో రామకృష్ణారావు, చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని గురువారం ఈ లెక్కింపు చేపట్టారు.
నగదుతో పాటు 100 గ్రాముల బంగారం, 4 కిలోల 250 గ్రాముల వెండి, 2,006 యూఎస్ డాలర్లు, 110 యూఏఈ దిర్హామ్స్, 355 ఆస్ట్రేలియన్ డాలర్లు, 195 కెనడియన్ డాలర్లతో పాటు సింగపూర్, ఇంగ్లాండ్, సౌదీ అరేబియా, ఒమన్ , మలేషియా , నేపాల్, ఖతార్, థాయిలాండ్ , న్యూజిలాండ్ , కువైట్, ఆఫ్రికా , బంగ్లాదేశ్, ఉగాండా, ఇండోనేషియా దేశాలకు చెందిన కరెన్సీ వచ్చింది. మరోవైపు గురువారం ఆలయాల్లో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా గురువారం ఆలయానికి రూ.25,64,062 ఆదాయం వచ్చిందని ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.