మే నాటికి యాదాద్రి థర్మల్ స్టేషన్ రెడీ : భట్టి విక్రమార్క

మే నాటికి యాదాద్రి థర్మల్ స్టేషన్ రెడీ : భట్టి విక్రమార్క
  • 4వేల మెగావాట్ల విద్యుత్​ను గ్రిడ్​కు అనుసంధానం చేస్తం: భట్టి
  • భవిష్యత్తులో కరెంట్ ఇబ్బందులుండవ్
  • త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ తీసుకొస్తామన్న డిప్యూటీ సీఎం
  • మంత్రులు ఉత్తమ్, వెంకట్​రెడ్డితో కలిసి యాదాద్రి థర్మల్ స్టేషన్ సందర్శన
  • స్టేజ్​1లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్​ గ్రిడ్​కు అనుసంధానం

నల్గొండ, వెలుగు : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్  (వైటీపీఎస్) పనులను 2025, మే నాటికి పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 4 వేల మెగావాట్ల విద్యుత్​ను గ్రిడ్​కు అనుసంధానం చేస్తామన్నారు. భవిష్యత్తులో కరెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమ, వ్యవసాయం, గృహ అవసరాలకు క్వాలిటీ పవర్​ను అందిస్తున్నామన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో కలిసి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్​ను ఆదివారం భట్టి పరిశీలించారు.

రామగుండం నుంచి యాదాద్రి థర్మల్ స్టేషన్​కు బొగ్గు తరలించే గూడ్స్ రైలుకు వైటీపీఎస్ టేక్ ఆఫ్ దామరచర్ల పాయింట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్ లోని స్టేజ్​1లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను గ్రిడ్​కు అనుసంధానం చేస్తూ స్విచ్ ఆన్ చేశారు. వైటీపీఎస్ పురోగతి పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. తర్వాత మంత్రులతో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.

‘‘2028–29 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పవర్ డిమాండ్ 22,288 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉంది. 2034–35 నాటికి 31,809 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతదని అంచనా వేస్తున్నం. దీనికి అనుగుణంగా కరెంట్ ఉత్పాదకతను పెంచుతాం. రాష్ట్ర అవసరాలకు కొరత లేకుండా పవర్ సప్లై చేస్తాం. విద్యుత్ రంగ అభివృద్ధిలో.. దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెడతం’’అని భట్టి తెలిపారు.

గత బీఆర్ఎస్ సర్కార్​ విద్యుత్ రంగాన్ని పట్టించుకోలే..

గ్రీన్ ఎనర్జీని పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని భట్టి విక్రమార్క తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్.. న్యూ ఎనర్జీ పాలసీని కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం త్వరలోనే పాలసీ తీసుకొస్తదని, దీని రూపకల్పనకు రాష్ట్రంలోని మేధావులు, విద్యుత్ రంగ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటదని వివరించారు. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చిస్తామని, అందరి ఆమోదంతో కొత్త ఎనర్జీ పాలసీ తీసుకొస్తామన్నారు.

‘‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా.. 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. పరిశ్రమలు నెలకొల్పేందుకు పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నయ్. ప్రొడక్షన్ కోసం కొంతమేర గ్రీన్ ఎనర్జీని ఉపయోగించాల్సి ఉంటది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఇబ్బందులు రాకుండా వారి అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాం’’అని వివరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జయవీర్ రెడ్డి, విద్యుత్ శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా, కలెక్టర్ త్రిపాఠి పాల్గొన్నారు.