వడ్ల పైసలు పడుతున్నయ్ .. రైతుల అకౌంట్లలో రూ.20 కోట్లు జమ

వడ్ల పైసలు పడుతున్నయ్ ..  రైతుల అకౌంట్లలో రూ.20 కోట్లు జమ
  • మరో రూ.30 కోట్లకు బిల్స్ పంపిన సివిల్ సప్లై ఆఫీసర్లు
  • నేడు జమ అయ్యే అవకాశం 
  • రూ.110 కోట్ల విలువైన.. 50 వేల టన్నుల వడ్ల కొనుగోలు 

యాదాద్రి, వెలుగు : ఈ సీజన్​లో వడ్ల పైసలు కాస్తా స్పీడ్​గానే పడుతున్నాయి. కొనుగోలు చేసిన వడ్లు మిల్లులకు చేరడమే ఆలస్యం సివిల్ సప్లయ్ ఆఫీసర్లు బిల్లులు పంపిస్తున్నారు. దీంతో పైసలు త్వరగా జమ అవుతున్నాయి. కొనుగోలు చేసిన వాటిలో 18 శాతం వడ్లకు పైసలు రైతులకు అందాయి. మరో 25 శాతం వడ్లకు సోమవారం అందే అవకాశం ఉంది. 

2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు..

ఈ యాసంగిలో జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 6 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్​ఆఫీసర్లు అంచనా వేయగా, సెంటర్లకు 4.50 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేశారు. ఈ మేరకు జిల్లాలో 372 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటివరకు 357 సెంటర్లు ఓపెన్ చేశారు. అయితే కొనుగోళ్లు మాత్రం 232 సెంటర్లలో మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పటివరకు 70 శాతం వరి కోతలు పూర్తిగా, కొన్ని ఏరియాల్లో ఇంకా మొదలు పెట్టలేదు. ఈనెల 3 నుంచి పలు ప్రాంతాల్లో తరచూ వానలు కురవడం వల్ల సెంటర్లలో వడ్లు తడిచి తేమ శాతం పెరగడంతో కొనుగోళ్లలో ఇంకా వేగం పుంజుకోలేదు.

 50 వేల టన్నుల ధాన్యం కొనుగోలు..

జిల్లాలో ఈనెల మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 232 సెంటర్లలో 5,666 మంది రైతుల వద్ద 50 వేల టన్నుల వడ్లను కొనుగోలు చేశారు. ఇందులో గ్రేడ్-–1 రకం వడ్లు 23 వేల టన్నులు కొనుగోలు చేయగా, కామన్​రకం 27 వేల టన్నులు కొనుగోలు చేశారు. వీటిలో 43 వేల టన్నుల వడ్లను మిల్లులకు తరలించారు. మొత్తంగా రూ.110 కోట్ల విలువైన వడ్లను కొనుగోలు చేశారు. 

రైతుల అకౌంట్లలో రూ.20 కోట్లు.. 

వడ్లు మిల్లుకు తరలించక ముందే ట్రాక్ షీట్లు రూపొందిస్తుండడంతో ఈసారి పేమెంట్ కొంత స్పీడ్​గా సాగుతోంది. వడ్లు మిల్లులకు వెళ్లడంతోనే సివిల్​సప్లయ్​ఆఫీసర్లు బిల్స్ రెడీ చేస్తున్నారు. శనివారం వరకు దాదాపు 1500 మంది రైతులకు చెందిన 8 వేల టన్నుల వడ్లకు సంబంధించి అమౌంట్​రూ.20 కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయి. మరో 13 వేల టన్నులకు సంబంధించి రూ.30 కోట్ల బిల్స్ రెడీ చేసి హయ్యర్ ఆఫీసర్లకు పంపించారు. ఈ మొత్తం సోమవారం సాయంత్రం వరకు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని సివిల్ సప్లయ్​ ఆఫీసర్లు చెబుతున్నారు.