
- డబుల్ ఇండ్ల పంపిణీకి.. పక్కా ప్లాన్
- ఇండ్ల మరమ్మతులకు రిపేర్లకు రూ.2.55 కోట్లు మంజూరు
- ఇందిరమ్మ ఇండ్లలో ఎల్–2 లీస్ట్ అర్హులకు ప్రయారిటీ
యాదాద్రి, వెలుగు : నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. అర్హులే అయినా.. వారిలో అసలు ఏమీలేని వారికి ఈ ఇండ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లయ్ చేసుకున్న వారిలో ఎల్–-2 కేటగిరీకి చెందిన వారి జాబితాను పరిశీలిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో డబుల్‌బెడ్ రూమ్ స్కీం కింద యాదాద్రి జిల్లాలో ఫస్ట్, సెకండ్పేజ్లు కలిపి 3,506 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 3,339 ఇండ్లకు టెండర్లు పిలవగా 1,445 ఇండ్లు ఫైనలయ్యాయి. వీటిలో చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, తుర్కపల్లి, ఆత్మకూర్(ఎం), యాదగిరిగుట్ట మండలాల్లో కొన్ని ఇండ్ల నిర్మాణం పూర్తయింది. నిర్మాణం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా.. అప్పటి సర్కారు పట్టించుకోలేదు. దీంతో ఆ ఇండ్లకు సంబంధించిన డోర్లు, కిటికీలు సహా ఇతర సామగ్రి దొంగల పాలయ్యాయి. ఆ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. కాగా 2023 ఎన్నికల టైంలో గత సర్కారు హడావుడిగా భువనగిరి, ఆలేరు, కొలనుపాక, తుర్కపల్లిలోని డబుల్ బెడ్రూమ్ఇండ్లను పంపిణీ చేసింది. అయితే భువనగిరి, తుర్కపల్లిలో సౌకర్యాలు లేని కారణంగా ఆ ఇండ్లకు లబ్ధిదారులు వెళ్లలేదు.
రిపేర్లకు రూ.2.55 కోట్లు..
పంపిణీ చేయని డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు సౌకర్యాలు లేని ఇండ్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇందులో భాగంగా భువనగిరిలో గతంలోనే పంపిణీ అయిన 444 ఇండ్ల మరమ్మతుల కోసం ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి రూ.2.55 కోట్లు మంజూరు చేయించారు. ఈ ఫండ్స్‌తో ఇండ్లకు డోర్లు, కిటికీలతోపాటు మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయనున్నారు.
ఇంటి స్థలం, ఇల్లు లేని వారికే డబుల్..
నిర్మాణం పూర్తయినా పంపిణీ కాని ఇండ్లను అర్హులైనవారికి అందించాలని యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లయ్చేసిన 2,01,977 మందిలో అర్హులుగా గుర్తించి 52,109 అప్లికేషన్లను పరిశీలించారు. ఈ జాబితాలో ఎల్–-2 కేటగిరీలో ఉన్న స్థలం, ఇండ్లులేని వాళ్లకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. వీళ్లలోనూ నిరుపేదలను గుర్తించి ఇండ్లు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి కసరత్తు కొనసాగుతోంది.
పంపిణీ కాని ఇండ్లు ఇవే..
జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లిలో నిర్మాణం పూర్తయి పంపిణీ చేయని ఇండ్లు 120 ఉన్నాయి. జిబ్లక్ పల్లిలో 36, బీబీనగర్‌లో 11, కొండమడుగులో 32 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకొని వృథాగా ఉంటున్నాయి. వీటిని త్వరలో పంపిణీ చేయనున్నారు.
త్వరలో పంపిణీ చేస్తాం
నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉంటున్న డబుల్బెడ్రూమ్ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఎల్–-2 జాబితాలో ఉన్న ఇంటి స్థలం, ఇండ్లు లేని వాళ్లను గుర్తిస్తున్నాం. అర్హులైన వీరిలో నిరుపేదలను గుర్తించి వారికి సాధ్యమైనంత త్వరగా అందిస్తాం.
హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి