
- యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట టైమ్
- కొమురవెల్లి, ఐనవోలు, వేములవాడలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు క్యూ కట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, పార్కింగ్ ఏరియా, బస్‌బే, క్యూలైన్లల్లో ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
ఆదివారం భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.49,28,666 ఆదాయం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.19,04,650, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.7,04,500, వీఐపీ దర్శనాలతో రూ.8.10 లక్షలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.3,78,900 ఇన్‌కం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు
మల్లన్న నామస్మరణతో మారుమోగిన కొమురవెల్లి, ఐనవోలు
కొమురవెల్లి/ఐనవోలు, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరివారమైన ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా రాజగోపురం, గంగిరెణి చెట్టు, కోడెల స్తంభం, రాతగీరలు పరిసరాలు కిటకిటలాడాయి. గంగరేణి చెట్టు, ఆలయ ముఖ మంటపం వద్ద భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మల్లన్నకు, ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు.
భక్తుల రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి 6 నుంచి 8 గంటలు పట్టింది. ఆలయ తోటబావి వద్ద సోమవారం తెల్లవారుజామున నిర్వహించనున్న అగ్నిగుండాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జబర్దస్త్ ఫేమ్ అవినాశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు.
అలాగే హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న కల్యాణం, పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా ని ర్వహించారు. సంక్రాంతికి మొదలైన బ్రహ్మోత్సవాలు ఉగాది రోజున ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి ఆదివారం కావడంతో బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మ సమేత మల్లికార్జున స్వామి కల్యాణంతో పాటు పెద్దపట్నం వేశారు. అనంతరం స్వామివారిని ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని, పట్నాలు వేసి, బోనాలు సమర్పించారు.
రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులు ధర్మగుండంలో స్నానం ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి నాలుగు గంటలు పట్టిందని భక్తులు తెలిపారు. దర్శనం అనంతరం కోడెలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.