దొంగలు ఉన్నారని నమ్మించి.. చైన్‌‌ తీసుకొని పొట్లంలో రాళ్లు కట్టి ఇచ్చిన్రు

  • వృద్ధురాలిని మోసంచేసిన కేటుగాళ్లు

భూదాన్ పోచంపల్లి, వెలుగు: మెడలో పుస్తెలతాడు ఉంటే దొంగలు ఎత్తుకెళ్తారని నమ్మించి ఓ వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. యాదగిరి భువనగిరి జిల్లా భూదాన్  పోచంపల్లి మునిసిపాలిటీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మునిసిపాలిటీ కేంద్రానికి చెందిన పోతగల్ల పాపమ్మ ఓ ప్రైవేట్  హోటల్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నది. ఆదివారం మధ్యాహ్నం హోటల్ లో పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె వద్దకు వెళ్లి మెడలో పుస్తెలతాడు ఉంటే దొంగలు ఎత్తుకెళ్తారని, తీసి కొంగులో కట్టుకొని ఇంటికి వెళ్లాక తీసుకోవాలని చెప్పాడు.

ALSO READ :అధికారులకు ఎన్నికల టెన్షన్

తమ ఇల్లు ఇక్కడికి దగ్గర్లోనే ఉందని పాపమ్మ జవాబు ఇచ్చింది. ఆమె నమ్మకపోవడంతో ప్లాన్  ప్రకారం మెడలో చైన్  వేసుకున్న మరో వ్యక్తి బైక్  మీద వచ్చి ఆమె ముందు నిల్చున్నాడు. అతనికి కూడా వృద్ధురాలికి చెప్పిన విధంగానే చెప్పి అతని మెడలో నుంచి చైన్  తీసి ఒక పేపర్ లో పొట్లం కట్టి అతని బ్యాగ్ లో వేశాడు. అలాగే వృద్ధురాలి మెడలో నుంచి 2 తులాల పుస్తెలతాడును తీసి పేపర్ లో పొట్లం కట్టినట్టు నటించాడు. రాళ్లతో  కట్టి ఉన్న పొట్లంను పాపమ్మ కొంగుకు కట్టి అక్కడి నుంచి ఆ ఇద్దరు బైక్ పై పరారయ్యారు. పాపమ్మ పొట్లం విప్పి చూడగా రాళ్లు ఉన్నాయి. అక్కడున్న  స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విక్రం తెలిపారు.